ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
ABN , Publish Date - Nov 01 , 2026 | 07:18 PM
జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినంత మాత్రాన ప్రయాణాన్ని ఆపేయాల్సిన అవసరం లేదని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన సందీప్. ఐఏఎస్ అధికారి కావాలనే కలతో హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు ఆశించిన ర్యాంకు రాలేదు.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయినంత మాత్రాన ప్రయాణాన్ని ఆపేయాల్సిన అవసరం లేదని నిరూపించారు హైదరాబాద్‌కు చెందిన సందీప్. ఐఏఎస్ అధికారి కావాలనే కలతో హైదరాబాద్‌కు వచ్చిన ఆయనకు ఆశించిన ర్యాంకు రాలేదు. ఆ తర్వాత సాంకేతిక రంగంలో ప్రారంభించిన వ్యాపారం కూడా కలిసి రాలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా భార్య సోనియాతో కలిసి కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఆ సంస్థ ఇప్పుడు సుమారు రూ.130 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది (Sandeep Jangala Yummy Bee).
సందీప్, సోనియా దంపతులకు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించాలనే ఆలోచన ఉండేది. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకల సమయంలో కేకులు కొనుగోలు చేసేటప్పుడు వాటిలో ఉండే నిల్వ పదార్థాలు, ఇతర అనవసర పదార్థాల గురించి ఆలోచించేవారు. అందుకే బయట కేకులు కొనడం కంటే ఇంట్లోనే తయారు చేసిన పదార్థాలను పిల్లలకు అందించేవారు. ఈ క్రమంలో సందీప్ స్వయంగా ఆరోగ్యకరమైన డిజర్ట్‌లను తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆరోగ్యకర ఆహారాన్ని ఇతరులకు కూడా అందించాలనే ఉద్దేశంతో 'యమ్మీ బీ' ప్రారంభించారు.
'యమ్మీ బీ' తయారు చేసే తీపి పదార్థాల్లో చక్కెర, మైదా, నిల్వ పదార్థాలకు బదులుగా చిరుధాన్యాలతో తయారైన పదార్థాలు, ప్రత్యామ్నాయ తీపి పదార్థాలను ఉపయోగిస్తున్నారు. రుచితో పాటు ఆరోగ్యకరమైన పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వడమే తమ వ్యాపార ఆలోచన అని సందీప్ తెలిపారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారికి కూడా తీపి పదార్థాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన అంచనాలకు మించి ఉండటంతో వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు (IAS Aspirant Success Story).
మొదట హైదరాబాద్‌లో 'యమ్మీ బీ' పేరుతో అవుట్ లెట్‌ను ప్రారంభించారు (Indian Startup Success Stories). ఆదరణ లభించడంతో బెంగళూరులోనూ మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొందరు ప్రముఖులు కూడా ఈ కేఫ్‌కు రావడంతో సంస్థకు మరింత గుర్తింపు లభించింది. వ్యాపారాన్ని ప్రారంభించిన తొలినాళ్లలో సందీప్ దంపతులు దాదాపు రూ.1 కోటి పెట్టుబడి పెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 'యమ్మీ బీ' సుమారు రూ.23 కోట్ల ఆదాయాన్ని సాధించినట్లు సందీప్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంస్థ విలువ సుమారు రూ.130 కోట్లుగా ఉందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
మాక్ పార్లమెంట్‌లోనే ప్రధాని అవ్వండి.. రాహుల్ గాంధీపై అమిత్ షా సెటైర్లు..
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. తొలి జాబితా విడుదలైన మరుసటి రోజే ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా..