సౌదీ దుస్తుల్లో చైనా రోబోలు.. కత్తి నృత్యంతో సందడి.. వీడియో వైరల్
ABN , Publish Date - Oct 01 , 2026 | 01:00 PM
సౌదీ సంప్రదాయం.. చైనా టెక్నాలజీ.. రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సౌదీ సంప్రదాయం.. చైనా టెక్నాలజీ.. రెండూ కలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇప్పుడు అలాంటి ఓ ఆసక్తికరమైన ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రియాద్‌లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో చైనీస్ హ్యూమనాయిడ్ రోబోలు సౌదీ అరేబియాకు చెందిన సంప్రదాయ అర్దా కత్తి నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ సౌదీ దుస్తులు అయిన థోబ్ ధరించిన రోబోలు చేతుల్లో కత్తులు పట్టుకుని సంగీతానికి అనుగుణంగా కదులుతూ, తిరుగుతూ, వంగి నమస్కరిస్తూ నృత్యం చేశాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపన 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రియాద్‌లోని చైనా రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన విందులో ఈ ప్రదర్శన జరిగింది. కార్యక్రమానికి రియాద్ ప్రాంత మేయర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ అయ్యాఫ్ అల్-ముక్రిన్.. సౌదీ అరేబియాలోని చైనా రాయబారి చాంగ్ హువా తదితరులు హాజరయ్యారు. సంప్రదాయ డ్రమ్స్ మోగుతుండగా రోబోలు క్రమబద్ధంగా కత్తులు ఊపుతూ కదలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌదీ సంస్కృతిలో అర్దాకు ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా పురుషుల బృందాలు కత్తులు పట్టుకుని డప్పుల లయకు అనుగుణంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే.. ఈసారి అదే సంప్రదాయ నృత్యాన్ని హ్యూమనాయిడ్ రోబోలు ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోటిక్స్, కృత్రిమ మేధస్సులో చైనా సాధిస్తున్న పురోగతికి ఈ ప్రదర్శన మరో ఉదాహరణగా నిలిచిందంటూ పలువురు పేర్కొన్నారు. ‘మనుషుల కన్నా రోబోలు బాగా పర్ఫామెన్స్ చేస్తున్నాయి’ అని ఒక నెటిజన్, ‘భవిష్యతో హ్యూమనాయిడ్ రోబోలదే’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్
బకాయిలు చెల్లించక పోతే... ఎమ్మెల్యేల కమీషన్ల దందా బయటపెడతాం
Read Latest National News And Telugu News