కదులుతోన్న కారులోంచి కిందపడిన చిన్నారి.. తల్లి అరెస్ట్
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:12 PM
కాలిఫోర్నియాలోని ఫులెర్టోన్‌లో ఓ పెను ప్రమాదం తప్పింది. కదులుతోన్న కారులోంచి 19 నెలల చిన్నారి ఒక్కసారిగా కింద పడ్డాడు. వెనక వస్తున్న కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో చిన్నారికి ఏమీ కాలేదు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు.. పిల్లాడి తల్లిని అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: 19 నెలల చిన్నారి.. కదులుతోన్న కారులోంచి ఒక్కసారిగా కింద పడ్డాడు. వెనుక వస్తున్న మరో కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. కాలిఫోర్నియాలోని ఫులెర్టోన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన చిన్నారి తల్లి జాక్వెలిన్ హెర్నాండెజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
అసలు ఏమైందంటే..
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. ఎస్‌యూవీ కారు ఎడమ వైపు మలుపు తిరుగుతున్న సమయంలో కారు ప్యాసింజర్ డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. ఒక్కసారిగా కారులోంచి 19 నెలల పిల్లాడు రోడ్డుపై పడిపోయాడు. వెనకే వస్తోన్న కారు డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ప్రమాదం తప్పింది. వెంటనే డ్రైవింగ్ చేస్తోన్న చిన్నారి తల్లి కారులోంచి కిందకు దిగి చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. జనవరి 20న జరిగిన ఈ ఘటనపై ఓ ప్రత్యక్ష సాక్షి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వాహనానికి సంబంధించిన వివరాలు అందించడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా కారు వివరాలతో సదరు మహిళను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఈ సిరీస్ సూప్ లాంటిది.. అసలు విందు ముందుంది: సునీల్ గావస్కర్
బంగ్లాను పాక్ రెచ్చగొడుతోంది: బీసీసీఐ ఉపాధ్యక్షుడు