Share News

పుట్టిన రోజు వేడుకలు ఎవరైనా ఇలా కూడా చేసుకుంటారా..? వీడియో వైరల్

ABN , Publish Date - Jun 26 , 2026 | 02:11 PM

ఓ నాయకుడు తన పుట్టిన రోజు వేడుకలను మురికి కాలువలో జరుపుకొన్నారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పుట్టిన రోజు వేడుకలు ఎవరైనా ఇలా కూడా చేసుకుంటారా..? వీడియో వైరల్
Agra

ఇంటర్నెట్ డెస్క్: పుట్టిన రోజు పండగ అంటే ఎవరైనా గ్రాండ్‌గానే చేసుకుంటారు. ఉన్నంతలో కేక్ కట్ చేసి.. వచ్చిన అతిథులకు భోజనం పెడతారు. అదే రాజకీయ నాయకుడిది అయితే పెద్ద ఫంక్షన్ హాల్‌లో భారీగా తరలి వచ్చిన జనం మధ్య పెద్ద కేక్‌ కట్ చేస్తారు. ఆ ఫంక్షన్‌కు ఆ నాయకుడి స్థాయిని బట్టి ప్రజలు తరలి వస్తారు. ఇలాంటి ఫంక్షన్లు నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఒక రాజకీయ నేత మాత్రం తన పుట్టిన రోజు వేడుకలను మురికి కాలువలో జరుపుకున్నాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


కాలువలోని మురుగు నీటిలో టేబుల్ ఏర్పాటు చేసి.. దానిపై తెల్లని వస్త్రం వేశారు. దీనిపై ఆ నాయకుడు కేక్ కట్ చేశారు. ఈ వేడుకను ప్రజలంతా చూస్తున్నారు. మీరు నిండూ నూరేళ్లు జీవించాలంటూ ఆ నేతను ఉద్దేశించి వారంతా బిగ్గరగా అరుస్తున్నారు. దీనిని అక్కడే ఉన్న పలువురు యువకులు.. తమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ప్రపంచంలో పది వింతల్లో ఒకటైన తాజ్‌మహాల్ ఉన్న ఆగ్రాలో నాగ్లాధాని ప్రాంతంలోని న్యూ విజయ్ నగర్ కాలనీలో చోటు చేసుకుంది. ఈ కేట్ చేసిన వ్యక్తి పేరు కిషన్ నాయక్. స్థానిక బీజేపీ నాయకుడు. ఆగ్రాలో ఆయన వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు.


మురుగు కాలువతోపాటు పరిసర ప్రాంతాన్ని శుభ్రం చేయాలంటూ మున్సిపల్ అధికారులకు ఒకటి రెండు సార్లు కాదు.. ఏకంగా 12 సార్లు ఫిర్యాదు చేశాడు. అయినా వారి నుంచి స్పందన లేదు. మరో వైపు వర్షా కాలం ముంచుకొస్తోంది. దీంతో మురికి కాలువలు పొంగి పొర్లుతాయి. దీంతో కిషన్ నాయక్ ఆందోళన చెందారు. మున్సిపల్ అధికారుల తీరుకు నిరసనగా ఆయన మురికి కాలువలో తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కిషన్ నాయక్ కేక్ కట్ చేస్తుంటే.. మీ వెంట మేమంతా ఉన్నామంటూ ఆయనకు ప్రజలు మద్దతు ప్రకటించారు.


ఎన్నికల్లో గెలిస్తే కచ్చితంగా మీ సమస్యలు పరిష్కరిస్తానంటూ ప్రజలకు చాలా మంది రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు. కానీ ఎన్నికల్లో గెలిచి.. పదవి చేపట్టిన తర్వాత వారంతా ప్రజల నుంచి దూరంగా జరుగుతారు. కానీ ప్రజల సమస్యను పరిష్కరించాలంటూ వారి తరఫున పోరాడే నేతలు నేడు అరుదై పోయారు. అలాంటి అరుదైన వారిలో కిషన్ నాయక్ ఒకరు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కిషన్ నాయక్‌పై నెట్‌జన్లు ప్రశంసిస్తున్నారు. ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతోన్నాయి.

Updated Date - Jun 26 , 2026 | 02:39 PM