Bhogi Pallu Rituals: పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.. దీని వెనుక ఉన్న కథ ఇదే..
ABN , Publish Date - Jan 14 , 2026 | 10:31 AM
భోగి పండుగ అంటే భోగి మంటలతో పాటు చిన్నారులపై భోగి పండ్లు పోసే ముచ్చటైన దృశ్యాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది.. భోగి పండ్లు పోసే విధానం, నియమాలు, వెనుక ఉన్న పురాణ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: తెలుగువారి పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగలో మొదటి రోజు భోగి. భోగి అంటే భోగిమంటలు మాత్రమే కాదు.. చిన్నారులకు భోగి పండ్లు పోసే ముచ్చటైన సంప్రదాయం కూడా ఉంది. పిల్లలను మధ్యలో కూర్చోబెట్టి, పెద్దలు చుట్టూ చేరి భోగి పండ్లు పోస్తుంటే ఆ దృశ్యం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అయితే.. ఈ సంప్రదాయం ఎందుకు మొదలైంది? భోగి పండ్లు పోసే విధానం, నియమాలు, వెనుక ఉన్న పురాణ కథ ఏంటంటే...
భోగి పండ్ల వెనుక ఉన్న కథ
భోగి పండ్లు పోసే సంప్రదాయానికి పురాణాలలో ఓ ప్రస్తావన ఉంది. ఒకప్పుడు నర నారాయణులు బదరికాశ్రమంలో తపస్సు చేస్తుండగా దేవతలు ఆనందంతో బదరీ ఫలాలను వారి మీద కురిపించారని కథనం. ఆ సందర్భంలో నారాయణుడు చిన్నబాలుడిగా మారినట్టు చెబుతారు. అప్పటి నుంచే పిల్లలను నారాయణుడి స్వరూపంగా భావించి, వారిపై బదరీ ఫలాలు(రేగి పండ్లు) కురిపించే సంప్రదాయం ప్రారంభమైంది. అందుకే పిల్లలకు భోగి పండ్లు పోసి దీవెనలు ఇస్తారు. రేగి పండ్లను కొన్ని ప్రాంతాల్లో అర్కఫలాలు అని కూడా అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ఈ సమయంలో, ఆయన కరుణ పిల్లలపై ఉండాలనే భావంతో ఈ ఆచారం పాటిస్తారు.

భోగి పండ్లు ఎందుకు ముఖ్యమంటే…
భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకు దీర్ఘాయుష్షు కలుగుతుందని, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని, దిష్టి తొలగిపోతుందని, అదృష్టం పెరుగుతుందని పెద్దలు నమ్ముతారు. అందుకే ఇది కేవలం ఆటలాగా కాకుండా ఒక ఆధ్యాత్మిక సంప్రదాయంగా తరతరాలుగా కొనసాగుతోంది.
భోగి పండ్లు పోయడానికి ఏమేం కావాలి?
రేగి పండ్లు
బంతి పువ్వు రేకులు
చెరుకు ముక్కలు
చిల్లర నాణేలు

భోగి పండ్లు ఎలా పోయాలి?
ముందుగా పిల్లలకు హారతి ఇవ్వాలి. ఆ తర్వాత ఒక పాత్రలో రేగి పండ్లు, పువ్వు రేకులు, చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు కలపాలి.
ముందుగా తల్లి పిల్లల చుట్టూ మూడు సార్లు దిష్టి తీసి, ఆ తరువాత పిల్లల తలపై భోగి పండ్లు పోయాలి. అనంతరం.. తండ్రి, మిగిలిన పెద్దలు కూడా అదే విధంగా చేస్తారు.
భోగి పండ్లు పోసిన తరువాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వదలాలి లేదా నీటిలో వదిలేయాలి. వీటిని తినకూడదు.. ఎందుకంటే అవి దిష్టి తీసినవి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?
For More Latest News