Share News

Bengaluru superstition viral: గుడ్లురిమి చూస్తున్న మహిళ.. ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే.. అసలు కథేంటంటే..

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:05 PM

బెంగళూరులో నిర్మితమవుతున్న పలు భవనాల గోడలకు ఓ మహిళ ఫొటో తగిలించిన వైనం చూసి ఓ వ్యక్తి ఆశ్చర్యపోయారు. ఎవరా మహిళ, ఆమె ఫొటోను ఎందుకు అలా గోడలకు తగిలిస్తున్నారని ప్రశ్నించారు. ఇది ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Bengaluru superstition viral: గుడ్లురిమి చూస్తున్న మహిళ.. ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే.. అసలు కథేంటంటే..
Warding Off Evil Eye - Bengaluru Viral Photo

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచం ఎంతో మారిపోయింది. అయితే, జనాల్లో మూఢనమ్మకాలు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బులతో ముడిపడిన విషయాల్లో జనాలు ఏ చిన్న రిస్క్‌ను కూడా తీసుకునేందుకు సిద్ధంగా లేరు. జాగ్రత్తల పేరిట కాస్త అతిచేష్టలకూ దిగుతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా బెంగళూరులో ఓ ఉదంతం వెలుగుచూసింది. నగరానికి కొత్తగా వచ్చే వారినీ ఇది ఆశ్చర్యపరుస్తూ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది (Bengaluru Superstition Viral).

@unitechy అనే ఎక్స్ అకౌంట్‌లో మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఈ ఉదంతం గురించి పంచుకున్నారు. బెంగళూరులో నిర్మితమవుతున్న అనేక భవనాల గోడలకు ఓ మహిళ ఫొటో తగిలించడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. ఎక్కడ చూసినా ఆ మహిళ ఫొటోనే కనిపిస్తోందని చెప్పారు. గుడ్లురిమి చూస్తున్న మహిళ ఎవరో తనకు ఇంతవరకూ తెలియరాలేదని చెప్పారు. గూగుల్ లెన్స్ ద్వారా వెతికినా ఫలితం లేకపోయిందని అన్నారు. మీకేమైనా తెలుసా అని జనాలను ఉద్దేశించి ప్రశ్నించారు (Bengaluru Woman- Viral Photo).


ఈ పోస్టుపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు. ఆ మహిళ ఫొటోను జనాలు దిష్టి బొమ్మగా వాడుతున్నారని వివరించారు. నర దృష్టి నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు. ఎర్రని నాలుక, కోరలు చాచినట్టు ఉన్న ప్లాస్టిక్ బొమ్మలను గతంలో వాడేవారని, వాటి స్థానంలో ఓ మనిషి ఫొటోను వాడటం కాస్త వింతగానే ఉంటుందని చెప్పారు.

ఇక ఫొటోలోని మహిళ ఎవరో ఓ వ్యక్తి వివరించారు. ఆమె పేరు నీహారికా రావ్ అని, ఆమె బెంగళూరు వాస్తవ్యురాలేనని చెప్పుకొచ్చారు. ఆమె యూట్యూబర్ కావడంతో 2023లో తొలిసారిగా ఆమె ఫొటో వైరల్‌గా మారిందని చెప్పారు. తొలుత ఆమె ఫొటో మీమ్ ట్రెండ్‌గా మారిందని చెప్పారు. ఆ తరువాత కొందరు ఆమె ఫొటోను ఇలాక్కూడా వాడటం ప్రారంభించారని అన్నారు. కాలం మారుతున్నా కూడా జనాల్లోని అభద్రతా భావం మాత్రం పూర్తిగా తొలగక ఇలాంటి వింత ట్రెండ్స్ తెరపైకి వస్తున్నాయని కామెంట్ చేశారు.


ఇవీ చదవండి:

సామాన్యుడి దుర్భర జీవితం.. నెట్టింట బీభత్సం సృష్టిస్తున్న వీడియో

షాకింగ్ వీడియో.. థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌‌జెండర్‌ల దాడి!

Updated Date - Jan 07 , 2026 | 05:16 PM