Peacedog Aloka: అమెరికా యాత్రకు భారత్ నుంచి వీధి కుక్క.. అసలు ఏం జరుగుతోందంటే..
ABN , Publish Date - Jan 04 , 2026 | 07:13 PM
భారత్‌లోని ఓ వీధి కుక్క ప్రస్తుతం అమెరికాలో శాంతి యాత్ర నిర్వహిస్తున్న వైనం నెట్టింట వైరల్‌గా మారింది. అసలు కథేంటంటే..
ఇంటర్నెట్ డెస్క్: మనిషి పట్ల అత్యంత విశ్వాసంగా ఉండే జంతువు శునకమే. ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. తనను కాపాడిన బౌద్ధ భిక్షువులను వీడేదే లేదంటున్న ఓ కుక్క వారి వెంట అమెరికాలో శాంతియాత్రలో పాల్గొంటోంది (Peacedog Aloka Viral Video).
అలోకా కథ ఇది..
జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల కొందరు బౌద్ధ భిక్షువులు తమ శాంతి సందేశాన్ని వినిపించేందుకు భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో ఓ కుక్క వారి కంటపడింది. కారు ఢీకొనడంతో గాయాలపాలైన ఆ కుక్కను వారు కాపాడారు. దానికి స్వస్థత చేకూరాక దానికి అలోకా అని పేరు పెట్టారు. తనను కాపాడినందుకు వారి పట్ల ఎనలేని కృతజ్ఞత పెంచుకున్న ఆ శునకం నాటి నుంచీ వారి వెంటే సంచరిస్తోంది. వారు ఎక్కడకు వెళితే అక్కడకు వెళుతోంది.
ప్రస్తుతం ఆ బౌద్ధ భిక్షువుల బృందం అమెరికాలో పర్యటిస్తోంది. అక్టోబర్ 25 వారు అమెరికా పర్యటనను ప్రారంభించారు. వారి వెంట అలోకా కూడా పర్యటనలో పాల్గొంటోంది. టెక్సాస్ మొదలు మొత్తం 10 రాష్ట్రాల్లో వారు పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీ చేరాక పర్యటన పూర్తికానుంది. ఐక్యత, సహృద్భావం, శాంతిసామరస్యాలు వంటివి ప్రోత్సహించేందుకు వారు ఈ పర్యటన చేపడుతున్నారు.
ఇక అలోకా కథ తెలుసుకుని అమెరికాలో అనేక మంది ఆశ్చర్యపోయారు. జంతుప్రేమికులు పెద్ద ఎత్తున స్పందిస్తూ శునకానికి కావాల్సిన వసతులు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రీ మెడికల్ చెకప్స్‌తో పాటు దానికి కావాల్సిన ఆహారాలను కూడా అందిస్తున్నారు. అన్నట్టు అలోకా కోసం ప్రత్యేకంగా ఓ ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది. ఈ శునకానికి సంబంధించిన అంశాలను అందులో నిత్యం అప్‌డేట్ చేస్తుంటారు.
ఇవీ చదవండి:
ఇలాక్కూడా జరుగుతుందా! ఇదేంటో తెలిస్తే.. వైరల్ వీడియో
వీడియో షేర్ చేసిన మహిళ.. నమ్మలేకపోతున్న నెటిజన్లు! ఇది కలా? నిజమా?