Thalassery Railway Station: వీడియో షేర్ చేసిన మహిళ.. నమ్మలేకపోతున్న నెటిజన్లు! ఇది కలా? నిజమా?
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:00 PM
ఓ మహిళ షేర్ చేసిన తలస్సేరి రైల్వే స్టేషన్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అక్కడి పరిశుభ్రత చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. నమ్మలేకపోతున్నామంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అత్యంత చవకైన రవాణా వ్యవస్థ భారత్‌లో ఏదైనా ఉందీ అంటే అది రైలే. కానీ రైల్వే మౌలిక వసతులు సరిగ్గా లేక ప్రయాణికులు నిత్యం అవస్థలు పడుతుంటారు. సామాజిక వేదికల్లో ఫిర్యాదు చేస్తుంటారు. అయితే, పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. వందేభారత్ వంటి ఆధునిక రైళ్లు భారతీయులకు అందుబాటులోకి వచ్చాయి. రైల్వే స్టేషన్‌ల రూపురేఖలు కూడా మారిపోతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణగా నెట్టింట ఓ వీడియో వైరల్‌గా మారింది. అయితే, తాము చూస్తున్నది నిజమో కాదో అర్థం కావట్లేదంటూ నెట్టింట జనాలు వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. ఇది కలా? నిజమా? అని అంటూ నోరెళ్లబెడుతున్నారు (Thalassery railway station viral video).
తలస్సేరి రైల్వే స్టేషన్ వీడియోను ఓ కేరళ మహిళ తాజాగా నెట్టింట పంచుకున్నారు. అయితే, స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండటాన్ని వీడియోలో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అద్దంలా మెరిసిపోతున్న ప్లాట్‌ఫామ్, ఎక్కడా చెత్తాచెదారం లేని వైనం చూసి నోరెళ్లబెడుతున్నారు. ‘చెత్త అనేదే అక్కడ లేదు’ అన్న క్యాప్షన్‌తో ముబీనా అనే మహిళ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను షూట్ చేస్తుండగా తన ఫోన్‌ను ఎవరూ ఎత్తుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదంటూ భద్రతా వ్యవస్థ పటిష్టతనూ ప్రస్తావించారు.
ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రైల్వే స్టేషన్ నిర్వహణ చూసి అనేక మంది ప్రశంసల వర్షం కురిపించారు. మరికొందరేమో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియాలో రైల్వే స్టేషన్ ఇంత పరిశుభ్రంగా ఉండటం అరుదైన విషయమేనని అన్నారు. మరికొందరేమో స్థానికులను ప్రశంసించారు. అక్కడి ప్రజల నరనరానా క్రమశిక్షణ, పౌర స్పృహ నిండిపోయిందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్‌తో నెట్టింట తెగ ట్రెండవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ తెచ్చుకున్నారా? దీని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూఇయర్ వేడుక.. ఏకంగా 16 సార్లు..