Gregorian Calender: కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ తెచ్చుకున్నారా? దీని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసా?
ABN , Publish Date - Jan 01 , 2026 | 02:17 PM
కొత్త ఏడాది అందరూ కొత్త క్యాలెండర్లను గోడకు తగిలించుకుని ఉంటారు. మరి మనం ప్రస్తుతం వాడుతున్న క్యాలెండర్ ఎలా వచ్చిందో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: కొత్త ఏడాది వచ్చేసింది. అనేక మంది పాత క్యాలెండర్లను మార్చేసి కొత్త క్యాలెండర్‌లను గోడలకు తగిలించేశారు. అయితే, ఈ క్యాలెండర్ డిజైన్ వెనక దాగున్న శ్రమ గురించి మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. మరి క్యాలెండర్ రూపకల్పన వెనకున్న చరిత్ర, కష్టాలు ఏంటో తెలుసుకుందాం పదండి (How Gregorian Calender Came into Existence).
అసలు కథ ఇదీ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరూ గ్రెగోరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నారు. దీన్ని సుమారు 440 ఏళ్ల క్రితం పదమూడవ పోప్ గ్రెగరీ రెడీ చేయించారు. అంతకుముందు క్యాలెండర్ లేదా? అంటే ఉంది. దాన్ని జూలియన్ క్యాలెండర్ అని పిలిచే వారు. కానీ దానితో పెద్దగా ఫలితం ఉండేది కాదు. జూలియస్ సీజర్ అనే రోమన్ పాలకుడు క్రీస్తూ పూర్వం 45 సంవత్సరంలో దీన్ని డిజైన్ చేయించారు. ఈ కాలెండర్‌లో సౌర సంవత్సరం వ్యవధిని కాస్త ఎక్కువగా లెక్కించడంతో భారీ పొరపాటు జరిగిపోయింది. దాదాపు 1500 సంవత్సరాల కల్లా క్యాలెండర్‌లో దోషాలు బయటపడ్డాయి. ఋతువులు, పండుగలు అన్నీ సమయం తప్పి వస్తుండటంతో క్యాలెండర్‌లో దోషాలు ఉన్నాయన్న విషయం అందరికీ అర్థమైంది.
అప్పటికి జూలియన్ క్యాలెండర్ అమల్లో ఉండటంతో పదమూడవ పోప్ గ్రెగరీ కూడా ఈ క్యాలెండర్ కారణంగా ఇబ్బంది పడ్డారు. సమస్యను పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలతో కలిసి రంగంలోకి దిగారు. జూలియన్ క్యాలెండర్‌లో దోషాలకు లీపు సంవత్సరం లెక్కింపు కారణమని గుర్తించారు. జూలియన్ క్యాలెండర్‌లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక రోజును అదనంగా చేసి లీపు సంవత్సరంగా పరిగణించేవారు. ఈ విధానాన్ని గ్రెగరీ పక్కన పెట్టారు. మరో సంక్లిష్ట విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత పాత క్యాలెండర్‌లోని సుమారు 10 రోజులను తొలగించి మళ్లీ కాలగణనను ప్రారంభించారు. దీంతో, సౌర సంవత్సరానికి, క్యాలెండర్‌కు మధ్య వ్యత్యాసం దాదాపుగా కనుమరుగై ఋతువులు, పండుగల విషయంలో మునుపటి తికమక మొత్తం తొలగిపోయింది. ఈ క్యాలెండర్‌తో ఉన్న ఉపయోగాల దృష్ట్యా కాలక్రమంలో అన్ని దేశాలు ఇదే క్యాలెండర్‌ను అమలు చేయడం ప్రారంభించాయి.
ఇవీ చదవండి
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూఇయర్ వేడుక.. ఏకంగా 16 సార్లు..
ఇంటిముందు కుర్చీ వేసుకుని కూర్చున్న వృద్ధురాలు.. ఇంతలో.. షాకింగ్ వీడియో