Dentist becomes AI Engineer: భారతీయ యువకుడి వినూత్న కెరీర్.. డెంటిస్ట్‌గా మొదలెట్టి చివరకు యాపిల్‌లో ఏఐ ఇంజినీర్‌గా..
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:10 PM
డెంటిస్ట్ అయిన ఓ భారతీయ యువకుడు చివరకు యాపిల్‌లో ఏఐ ఇంజినీర్‌గా మారిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో వైరల్ అవుతోంది. మనసుకు నచ్చిన మార్గంలో ప్రయాణించేందుకు వెనకాడొద్దని అతడు యువతకు సలహా ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: కొందరు వైద్య రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. మరికొందరు ఇంజినీరింగ్ రంగంలో తమ కెరీర్‌ను నిర్మించుకుంటారు. కానీ ఓ భారతీయ యువకుడు మాత్రం డెంటిస్ట్‌గా మొదలెట్టి చివరకు ఏఐ ఇంజినీర్‌గా మారడమే కాకుండా ఏకంగా యాపిల్‌లో జాబ్ కొట్టాడు. ఇలా అసాధారణ మార్గంలో కెరీర్ నిర్మించుకున్న ఆ వ్యక్తి పేరు అన్షుల్ గాంధీ. ప్రస్తుతం అతడి ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది (Career Switch Dentist to AI).
2013లో గాంధీ ఓ డెంటల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అయితే, ఫైనల్ ఇయర్‌లో ఉండగా అతడికి ప్రోగ్రామింగ్‌పై ఆసక్తి కలిగింది. అదే తన అభిరుచికి తగిన కెరీర్ అన్న భావన బలపడింది. దీంతో, ప్రోగ్రామింగ్ పై దృష్టిపెట్టిన అతడు చదువు అయ్యాక డాటా అనాలిసిస్ జాబ్‌లో చేరాడు. దీంతో, అతడికి ప్రోగ్రామింగ్‌తో పాటు ఏఐ సాంకేతికతతో కూడా పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో గాంధీ 2016లో బయోమెడికల్ ఇన్ఫర్మేటిక్స్‌లో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఆధునిక ఏఐ సాంకేతికతల మరింత పట్టు సాధించాడు. 2018లో చదువు పూర్తయ్యాక డాటా సైంటిస్ట్‌గా ఓ సంస్థలో చేరాడు. 2021లో డెల్‌లో మెషీన్ లర్నింగ్ ఇంజినీర్‌గా జాబ్ దక్కించుకున్నాడు. అయితే, కోట్ల మంది వినియోగదారులకు సేవలందించే ఏఐ సాంకేతికతలపై పట్టుసాధించాలనేది అతడి లక్ష్యం. ఈ కలను సాకారం చేసుకోవాలంటే మెటా, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ సంస్థల్లో చేరడం ఒక్కటే మార్గం (Indian AI engineer at Apple).
దీంతో, డెల్‌ను వీడిన గాంధీ మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. పెద్ద టెక్ కంపెనీల్లో జాబ్ కొట్టడం అంత ఈజీగా కాదు. కాబట్టి, అతడు నెట్వర్కింగ్‌పై దృష్టి పెట్టాడు. లింక్డిఇన్‌లో యాక్టివ్‌గా ఉంటూ తన కనెక్షన్స్‌ను 200 నుంచి 500లకు పెంచుకున్నాడు. అదే సమయంలో ఏఐ, మెషీన్ లర్నింగ్‌పై తన అభిప్రాయాలను, ఇతర కంటెంట్‌ను నిత్యం షేర్ చేస్తూ ఓ థాట్ లీడర్‌గా గుర్తింపు పొందాడు. ఆయా రంగాల నిపుణులతో నిత్యం లింక్డ్‌ఇన్ వేదికగా చర్చలు జరుపుతూ యాక్టివ్‌గా ఉండేవాడు. కేవలం రిఫరెల్స్ మాత్రమే కోరకుండా సబ్జెక్ట్‌పై తనకు సహజంగా ఉన్న అభిరుచిని జనాలు గుర్తించేలా జాగ్రత్త పడ్డాడు. దీంతో, కొన్ని రిఫరెల్స్ తరువాత అతడికి యాపిల్‌లో మెషిన్ లర్నింగ్ ఇంజినీర్‌గా జాబ్ వచ్చింది. ఎట్టకేలకు అనుకున్నది సాధించినందుకు అతడి సంబరానికి అంతే లేకుండా పోయింది. నచ్చిన మార్గంలో ప్రయాణించేందుకు భయపడొద్దని ఈ సందర్భంగా అతడు యువతకు సూచించాడు.
ఇవీ చదవండి:
వివాహితతో ఎఫైర్.. ఆమె భర్తకు లవర్ పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు
రైల్లో కిటికీ పక్కన మహిళ.. ప్లాట్‌ఫాంపై పోలీసు సడెన్‌గా ఆమె ఫోన్ లాక్కోవడంతో..