Share News

Haryana Monkey Attack: ఇంటిముందు కుర్చీ వేసుకుని కూర్చున్న వృద్ధురాలు.. ఇంతలో.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Jan 01 , 2026 | 11:59 AM

హర్యానాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఆరుబయట కూర్చొన్న ఓ వృద్ధురాలిపై కోతుల గుంపు దాడి చేసింది. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది.

Haryana Monkey Attack: ఇంటిముందు కుర్చీ వేసుకుని కూర్చున్న వృద్ధురాలు.. ఇంతలో.. షాకింగ్ వీడియో
Haryana Monkey Attack

ఇంటర్నెట్ డెస్క్: కుక్కలు, కోతుల బెడద నానాటికీ ఎక్కువైపోతోంది. ఎవరి ఇంటి ముందు వారు ప్రశాంతంగా కూర్చోలేని పరిస్థితులు వచ్చిపడ్డాయి. తాజాగా హర్యానాలో ఓ వృద్ధురాలికి షాకింగ్ అనుభవం ఎదురైంది. తన ఇంటిముందు కూర్చున్న ఆమెపై ఒక్కసారిగా కోతులు దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Haryana Monkey Attack Viral Video).

బహదూర్‌గఢ్‌లో డిసెంబర్ 26న ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఎండ కోసమని ఓ వృద్ధురాలు తమ ఇంటి ముందు కుర్చీలో కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. ఇంతలో ఓ కోతుల గుంపు అక్కడకు వచ్చింది. కోతులను చూడగానే ఆమె అప్రమత్తమయ్యారు. కుర్చీ లోంచి మెల్లగా లేచేందుకు ప్రయత్నిస్తుండగా ఓ కోతి వచ్చి ఆమెను కొరికింది. ఆ తరువాత ఒకటి తరువాత మరొకటిగా రెండు మూడు కోతులు వచ్చి ఆమెపై దాడికి దిగాయి. వయసు రీత్యా వృద్ధురాల త్వరగా కదలలేక, వాటి నుంచి తప్పించుకోలేక ఇబ్బంది పడ్డారు. ఆమెను కాపాడేందుకు మరో మహిళ రాగా ఆమెపై కూడా కోతులు దాడి చేశాయి. అయితే, అదృష్టవశాత్తూ, వారు ఎలాగొలా కోతుల మంద తప్పించుకోగలిగారు.


ఘటనలో గాయపడ్డ వృద్ధురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇన్ఫెక్షన్లు సోకకుండా వైద్యులు ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. కోతుల గుంపు ఇంకా ఆ ప్రాంతంలో ఉందని తెలిసి జనాలు హడలిపోతున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఘటన తాలూకు వీడియో కూడా నెట్టింట కలకలం రేపుతోంది.


ఇవీ చదవండి:

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో న్యూఇయర్ వేడుక.. ఏకంగా 16 సార్లు..

ఎలాంటి కాలం దాపురించిందో! ఈ యువతి పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Updated Date - Jan 01 , 2026 | 12:18 PM