Share News

వృద్ధాప్యంలో చిగురించిన ప్రేమ.. ఆశ్రమంలో ఒక్కటైన రెండు మనసులు

ABN , Publish Date - Nov 25 , 2026 | 09:18 PM

75 ఏళ్ల వయసున్న ఆయనను తన కుటుంబం వదిలేసింది. 63 ఏళ్ల ఆమెను తన సంతానం పట్టించుకోవడం మానేసింది.

వృద్ధాప్యంలో చిగురించిన ప్రేమ.. ఆశ్రమంలో ఒక్కటైన రెండు మనసులు
Kanhaiya Lal & Sabina

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమకు వయసుతో సంబంధం లేదు. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 75 ఏళ్ల వయసున్న ఆయనను తన కుటుంబం వదిలేసింది. 63 ఏళ్ల ఆమెను తన సంతానం పట్టించుకోవడం మానేసింది. ఈ ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ ఆశ్రమానికి చేరారు. అక్కడ వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఒకరికొకరు తోడుగా, నీడగా మారారు. అండగా నిలబడ్డారు. అలా పెళ్లిపీటలు ఎక్కారు. కన్హయ్య లాల్, సబినాల ప్రేమ ప్రయాణానికి సంబంధించింది ఈ కథనం.


హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జంఝేలిలో కన్హయ్య లాల్ గతంలో నివసించేవారు. కొన్ని సంవత్సరాల కిందట ఆయనకు సతీవియోగం కలిగింది. లాల్‌కు పిల్లలు లేరు. దీంతో తనకున్న ఆస్తులన్నీ లాల్ సోదరులకు రాసిచ్చేశారు. ఆస్తి ఇచ్చినందుకు సోదరులు తనను ఇంకా ప్రేమగా చూసుకుంటారని భావించారు. కానీ ఇందుకు భిన్నంగా జరిగింది. ఇక లాల్‌తో పని లేదని భావించిన కుటుంబ సభ్యులు ఆయనను వదిలించుకున్నారు. చేసేదేమీ లేక కన్హయ్య లాల్ ఓ గుహలో ఒంటరిగా ఉండేవారు. ఆ సమయంలో అప్నా ఘర్ అనే వృద్ధాశ్రమం ఆయనను అక్కున చేర్చుకుంది. ఆలనా పాలనా చూసుకుంది.


మరోవైపు కోల్‌కతాకు చెందిన సబినాదీ ఇదే తరహా కథ. కుటుంబం ఆమెను పట్టించుకోవడం మానేసింది. దీంతో సబినా హిమాచల్ ‌ప్రదేశ్ వచ్చారు. అక్కడ ఆమె అప్నా ఘర్ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఇలా ఒకే చోటకి చేరారు కన్హయ్య లాల్, సబినా. వీరి మధ్య పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. వృద్ధాప్యంలో ఈ ఇద్దరికీ తోడు దొరికింది. శేషజీవితం కలిసే బతకాలని వీరు నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒకరికొకరు అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అదే ఆశ్రమంలో కన్హయ్య లాల్, సబినా వివాహం జరిగింది. అక్కడి వృద్ధులు వీరిని మనస్ఫూర్తిగా దీవించారు.. ఆశీర్వదించారు. ఈ పెళ్లికి ఆ జిల్లా డిప్యూటీ కమిషనర్ కూడా వచ్చారు. దంపతుల మధ్య అనురాగం, అనుబంధం చూసి ముగ్ధులయ్యారు. కాగా ఈ కల్యాణానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.


ఇవీ చదవండి

మీరు 1,400 ఏళ్లు బతకవచ్చు.. స్వీడన్ ప్రొఫెసర్ ధీమా

ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్.

Updated Date - Nov 25 , 2026 | 09:18 PM