మీరు 1,400 ఏళ్లు బతకవచ్చు.. స్వీడన్ ప్రొఫెసర్ ధీమా
ABN , Publish Date - Nov 25 , 2026 | 06:41 PM
భట్టి విక్రమార్కులు 2,000 సంవత్సరాలు జీవించారని జానపద కథలు చెబుతుంటాయి. అయితే మీరు కూడా అన్ని ఏళ్లు బేషుగ్గా బతకవచ్చని ప్రస్తుతం ఓ తత్త్వవేత్త చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భట్టి విక్రమార్కులు 2,000 సంవత్సరాలు జీవించారని జానపద కథలు చెబుతుంటాయి. అయితే మీరు కూడా అన్ని ఏళ్లు బేషుగ్గా బతకవచ్చని ప్రస్తుతం ఓ తత్త్వవేత్త చెబుతున్నారు. మరీ రెండు వేల సంవత్సరాలు కాకపోయిన కనీసం 1,400 ఏళ్లు హాయిగా జీవించవచ్చని వివరిస్తున్నారాయన. ఏంటీ నమ్మశక్యం కావడం లేదా..? ఈరోజుల్లో సెంచరీ కొట్టడమే కష్టం.. దాదాపుగా వేయిన్నర ఏళ్లు ఎలా బతుకుతారని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయా..? మీరు నమ్మకపోయినా ఇది నిజమంటున్నారు స్వీడన్‌కు చెందిన నిక్ బోస్ట్రోమ్. వృద్ధాప్యం అనేదే లేకుండా చేస్తే.. మనిషి జీవిత కాలం అమాంతం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
వృద్ధాప్యాన్ని జయిస్తే.. మనుషులు 1,400 ఏళ్ల వరకు సజీవంగా ఉంటారనేదానికి ఓ చిన్న గణిత సూత్రం ఆధారమని నిక్ బోస్ట్రోమ్ చెప్పారు. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో 20-25 మధ్య వయసు వారిలో మరణ రేటు కేవలం 0.07గా ఉంది. అంటే ఒక వ్యక్తికి వృద్ధాప్యమే లేకపోతే 1,400 సంవత్సరాలు బతకొచ్చు’ అంటూ ఆయన పేర్కొన్నారు. అయితే ఇదంతా లెక్కలకు మాత్రమే పరిమితమని కొందరు వాదిస్తున్నారు. మరోవైపు రానున్న ఏఐ సాంకేతికతతో నిజంగానే వృద్ధాప్యం దూరమవుతుందని బోస్ట్రోమ్ వివరిస్తున్నారు. ‘భవిష్యత్తులో ఏఐ అనేక వ్యాధులను నయం చేయగలదు. శరీరంలోని కణాలు సృష్టించడం కూడా అది నేర్చుకుంటుంది. అవయవాలను తయారు చేసే సామర్థ్యమూ దానికి వస్తుంది. అలాంటప్పుడు వృద్ధాప్యం ఎందుకు ఉంటుంది..?’ అని ఆయన వెల్లడించారు. చాలా మంది ఆరోగ్య నిపుణులూ ఏఐ ఆయుర్దాయాన్ని పెంచగలదని విశ్లేషిస్తున్నారు. కానీ 1,400 ఏళ్లు జీవించడం అసాధ్యమని అంటున్నారు.
ఇవీ చదవండి
ఆకాశంలో వెండివెన్నెల.. హిమాలయాల మధ్య చంద్రోదయం.. వీడియో వైరల్..
లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్