Share News

లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:15 PM

ధూమపానమే కాదు మద్యపానం సైతం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసినా.. వీటికి అలవాటైన వారు వాటిని ఒక పట్టాన మానడం లేదు. ధూమపానం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వస్తుండగా.. మద్యపానం వల్ల కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

లిక్కర్ షాపుల్లో వైద్య పరీక్షలు.. హడలిపోతున్న మందుబాబులు.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ధూమపానమే కాదు మద్యపానం సైతం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసినా.. వీటికి అలవాటైన వారు వాటిని ఒక పట్టాన మానడం లేదు. ధూమపానం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వస్తుండగా.. మద్యపానం వల్ల కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో అనారోగ్యం బారిన పడి.. మరణానికి చేరువ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా యంత్రాంగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మద్యం కొనుగోలు చేయాలంటూ ఈ ఆరోగ్య పరీక్ష తప్పని సరి చేసింది ఆ జిల్లా యంత్రాంగం.


సదరు జిల్లాలోని మద్యం షాపుల వద్ద వైద్య బృందాలను నియమించింది. లిక్కర్ కోసం ఈ షాపులకు వచ్చినప్పుడు మద్యపాన ప్రియుల ఆరోగ్యాన్ని వైద్య బృందాలు పరీక్షిస్తాయి. కాలేయం, మూత్రపిండాల పని తీరును పరీక్షిస్తారు. అలాగే వారి రక్త నమూనాలను సేకరించి.. పరీక్షిస్తారు. దీంతో వారి ఆరోగ్యాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటారు. ఓ వేళ కాలేయం, మూత్రపిండాల సమస్యలు అధికంగా ఉంటే.. అతిగా మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలను వారికి సోదాహరణంగా వివరిస్తారు.


మరింతగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వారికి హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యపానాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ.. చివరకు మానివేసే ప్రయత్నం చేయాలని వారికి సూచిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ పరీక్షలు నిర్వహిస్తు్న్నారు. ఆరోగ్య, ఎక్సైజ్ శాఖలు సంయుక్తంగా ఈ పరీక్షలు చేస్తున్నారు.


అధిక మోతాదులో మద్యం సేవించి.. తీవ్ర ఆనారోగ్యంతో పలువురు మరణించారని ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ శైలేంద్ర సింగ్ వివరించారు. అలాగే ప్రభుత్వ లైసెన్స్ ఉన్న మద్యం షాపుల నుంచే లిక్కర్ కొనుగోలు చేయాలని మద్యపాన ప్రియులకు ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాలో మద్యం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆందోళనకరంగా ఉంది. అదీకాక ఇటీవల బుండా, సాగర్‌, డియోరిలలో కల్తీ మద్యం సేవించి.. దాదాపు 30 మంది మరణించారు. దాంతో మద్యం షాపుల వద్దే మద్యపాన ప్రియులకు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లుకు సాగర్ జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.

Updated Date - Nov 25 , 2026 | 04:38 PM