ఆకాశంలో అరుదైన అద్భుతాలు.. ఆగస్టు 12న నాలుగు ఖగోళ ఘటనలు
ABN , Publish Date - Aug 09 , 2026 | 04:35 PM
అంతరిక్ష పరిశోధకులకు, ఆకాశాన్ని ఆసక్తిగా గమనించే వారికి ఆగస్టు 12వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది.
ఇంటర్నెట్ డెస్క్: అంతరిక్ష పరిశోధకులకు, ఆకాశాన్ని ఆసక్తిగా గమనించే వారికి ఆగస్టు 12వ తేదీ ప్రత్యేకమైన రోజుగా నిలవనుంది. 24 గంటల వ్యవధిలో ఆరు గ్రహాల వరుస పరేడ్, సంపూర్ణ సూర్యగ్రహణం, అమావాస్య, ఉల్కావర్షం వంటి నాలుగు ఖగోళ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి (August 12 2026 Sky Events).
గ్రహాల వరుస..
ఆగస్టు 12న సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఆరు గ్రహాలు ఒకే ప్రాంతంలో వరుసగా కనిపించనున్నాయి. బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ తూర్పు నుంచి పడమర వైపు విస్తరించి వరుసగా కనిపిస్తాయి. వీటిలో అంగారకుడు, శని వంటి ప్రకాశవంతమైన గ్రహాలను సాధారణ కంటితోనే గుర్తించే అవకాశం ఉంటుంది. అయితే యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలను చూడటానికి మాత్రం దూరదర్శిని అవసరం (Six Planet Parade).
సంపూర్ణ సూర్యగ్రహణం..
ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. భూమికి, సూర్యుడికి మధ్యలో చంద్రుడు రాబోతున్నాడు. గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్, స్పెయిన్ దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది. యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల నుంచి పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. భారత్‌లో ఈ సూర్యగ్రహణం కనిపించదు. భారత కాలమానం ప్రకారం, ఆగస్టు 12 రాత్రి సుమారు 9:45 గంటల నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 గంటల మధ్య గ్రహణ కాలం ఉంటుంది (Solar Eclipse 2026).
అమావాస్య..
సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజునే ఏర్పడుతుందనే సంగతి తెలిసిందే. ఈ దశలో, భూమి వైపు ఉండే చంద్రుని భాగం సూర్యకాంతి లేకుండా ఉంటుంది. దీంతో రాత్రి ఆకాశం సాధారణం కంటే మరింత చీకటిగా ఉంటుంది. ఆకాశంలో అద్భుతాలను వీక్షించేందుకు ఈ చీకటి అనుకూల పరిస్థితులను కల్పిస్తుంది (New Moon August).
ఉల్కావర్షం..
ఆగస్టు 12న మరో ప్రధాన ఆకర్షణ పెర్సీడ్ ఉల్కావర్షం (Perseid Meteor Shower 2026). ప్రతి ఏడాది కనిపించే ఈ ఉల్కావర్షం ఆగస్టులో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. చంద్రకాంతి లేకపోవడం వల్ల ఈసారి ఉల్కలను వీక్షించేందుకు ఆకాశం మరింత అనుకూలంగా ఉండనుంది. పూర్తి చీకటిగా ఉండే ప్రాంతాల్లో గంటకు 100 వరకు ఉల్కలు కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మక్కా ఒప్పందంలో చేరనున్న ఈజిప్ట్.. టర్కీ కీలక ప్రకటన..
సౌదీ అరామ్‌కోపై డ్రోన్ దాడి.. హౌతీల కీలక ప్రకటన..