విశాఖపట్నంలో ఏషియన్- ఇండియా మారిటైం కాంక్లేవ్.. హాజరైన మంత్రి లోకేశ్
ABN, Publish Date - Nov 23 , 2026 | 03:06 PM
విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో సోమవారం నాడు నిర్వహించిన ఏషియన్- ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కాంక్లేవ్ జరిగింది.
1/16
విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో సోమవారం నాడు నిర్వహించిన ఏషియన్- ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటాతో కలిసి మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
2/16
ఇండియా ఫౌండేషన్, భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో ఈ కాంక్లేవ్ జరిగింది.
3/16
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడారు. మారిటైం రంగంలో ఆగ్నేయాసియా దేశాలతో బలమైన, శాశ్వతమైన భాగస్వామ్యాలను తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
4/16
సముద్ర అనుసంధానం, సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
5/16
విశాఖపట్నానికి గొప్ప సముద్ర చరిత్ర ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖ భారతదేశ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి నిలయమని చెప్పుకొచ్చారు. నేడు వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో ముఖ్యమైన కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.
6/16
ఆగ్నేయాసియా దేశాలతో మన సంబంధాలు శతాబ్దాల నాటివని మంత్రి లోకేశ్ వివరించారు. ఆధునిక రవాణా వ్యవస్థలు అందుబాటులోకి రాకముందే మన తీర ప్రాంతాల మధ్య వ్యాపారులు, పరిశోధకులు ప్రయాణాలు చేస్తూ వస్తువులు, విజ్ఞానం, సంస్కృతిని పరస్పరం పంచుకునేవారని వెల్లడించారు.
7/16
కళింగపట్నం, మచిలీపట్నం వంటి ప్రాచీన నౌకాశ్రయాలు ఈ సంబంధాల్లో కీలక పాత్ర పోషించాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఒకప్పుడు సముద్రమే మన తొలి రహదారి అని చెప్పారు. నేడు ఆధునిక నౌకాశ్రయాలు, డిజిటల్ సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం ద్వారా ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం మనకు ఉందని అన్నారు. అందుకే ఈ సదస్సుకు కనెక్టివిటీ - కన్వర్జెన్స్ - కోఆపరేషన్ అనే థీమ్‌ను ఎంచుకున్నామని తెలిపారు.
8/16
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారతదేశం తన సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కొత్త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. సాగరమాల, మారిటైమ్ ఇండియా విజన్ - 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ - 2047 కార్యక్రమాల ద్వారా మెరుగైన నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణం, రవాణా, సరుకు నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.
9/16
భారత నౌకా నిర్మాణం, సముద్ర రంగాన్ని బలోపేతం చేసేందుకు దాదాపు రూ.70,000 కోట్లతో కూడిన ప్యాకేజీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. ఇందులో రూ.25,000 కోట్ల మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ కూడా ఉందని మంత్రి లోకేశ్ చెప్పారు.
10/16
భారతదేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరుకు రవాణా సముద్ర మార్గం ద్వారానే జరుగుతోందని ప్రస్తావించారు. మన ఆర్థిక అభివృద్ధికి మెరుగైన నౌకాశ్రయాలు, నౌకాయాన మౌలిక సదుపాయాలు అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి నూతన నౌకాశ్రయం పరిశ్రమలకు, వ్యాపారాలకు, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
11/16
ఇటీవల మనీలాలో జరిగిన భారత్ - ఏసియన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసంధానం, పరిశోధన, విపత్తుల నిర్వహణ, సముద్ర భద్రత వంటి అంశాలతో కూడిన దీర్ఘకాలిక సముద్ర సహకార ప్రణాళికను ప్రతిపాదించి, పరస్పర సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారని అన్నారు. ఈ దార్శనికతను సాకారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
12/16
భారతదేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటైన ఏపీకి దాదాపు 1,053 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీని మేజర్ మారిటైం, ఇండస్ట్రీయల్ గేట్ వేగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17 మిలియన్ టన్నుల సరుకును చేరవేసిందని తెలిపారు.
13/16
ఈ విషయంలో దాదాపు 10 శాతం వృద్ధి నమోదైందని మంత్రి లోకేశ్ అన్నారు. రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడల్లో 4 నూతన పోర్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ పోర్టులు రవాణా అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు ఏపీ, పొరుగు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు తోడ్పాటును అందిస్తాయని తెలిపారు.
14/16
దుగరాజపట్నంలో దాదాపు రూ.30వేల కోట్ల పెట్టుబడితో మేజర్ షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని తాము ప్రతిపాదించామని మంత్రి లోకేశ్ అన్నారు. గత వారమే విశాఖపట్నంలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, నౌకల మరమ్మతులు వంటి రంగాలకు సంబంధించి దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ఐదు సముద్ర రంగ అవగాహన ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. పోర్టులను పరిశ్రమలతో, వాటిని అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
15/16
సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ అనుసంధానం కూడా కీలకంగా మారుతోందని లోకేశ్ వెల్లడించారు. ఈ మార్పునకు విశాఖపట్నం కీలక కేంద్రంగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. విశాఖపట్నంలో గిగావాట్ స్థాయి ఏఐ హబ్‌ను అభివృద్ధి చేయడంతో పాటు డేటా సెంటర్లు, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ అనుసంధాన వ్యవస్థల ఏర్పాటుకు గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని అన్నారు. మూడు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు విశాఖపట్నంలో ల్యాండ్ కానున్నాయని వివరించారు.
16/16
రుషికొండలో సిఫీ సంస్థ అభివృద్ధి చేస్తున్న విశాఖపట్నం తొలి ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశామని మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారని చెప్పారు. విద్యార్థిగా ఉన్నప్పుడు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తూ విశాఖపట్నం మీదుగా వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారని అన్నారు. అప్పట్లో విశాఖపట్నం ప్రశాంతమైన, అపార అవకాశాలున్న సముద్రతీర నగరంగా తనకు గుర్తుండిపోయిందని తెలిపారు.
Updated at - Nov 23 , 2026 | 03:15 PM