న్యూజెర్సీలో తానా CPR & AED శిక్షణ కార్యక్రమం
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:40 PM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో విజయవంతంగా CPR & AED శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో విజయవంతంగా CPR & AED శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు కుటుంబాలు, యువత, విద్యార్థులు, స్థానిక కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే కీలక నైపుణ్యాలను అభ్యసించారు.

అత్యవసర పరిస్థితులపై అవగాహన..
ఈ శిక్షణను చీఫ్ అల్ లో-బీర్ నిర్వహించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) ఎలా చేయాలి, AED (Automated External Defibrillator) పరికరాన్ని ఎలా ఉపయోగించాలి వంటి అంశాలపై ఆయన సమగ్రంగా అవగాహన కల్పించారు. పాల్గొన్నవారు ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా శిక్షణ మోడల్స్‌పై ప్రాక్టికల్‌గా అభ్యసించి అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చీఫ్ అల్ లో-బీర్, రెండేళ్ల క్రితం తానా అందించిన LUCAS Chest Compression System గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అత్యవసర సేవల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది: అల్ లో-బీర్
తానా అందించిన LUCAS Chest Compression System తమ అత్యవసర సేవల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచిందని చీఫ్ అల్ లో-బీర్ వ్యాఖ్యానించారు. ఈ పరికరం గుండెపోటు వచ్చిన రోగులకు ఆస్ప త్రికి తరలిస్తున్న సమయంలో కూడా నిరంతరాయంగా, నాణ్యమైన ఛెస్ట్ కంప్రెషన్స్ అందించడానికి ఎంతో సహాయపడుతోందని తెలిపారు. గత రెండేళ్లుగా ఇది తమ ప్రాంతంలో అనేక ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషించిందని వివరించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి విలువైన పరికరాన్ని అందించిన తానాకు అల్ లో-బీర్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

LUCAS Chest Compression System అనేది గుండె ఆగిపోయిన రోగులకు ఆటోమేటిక్‌గా, అలసట లేకుండా, నిరంతరాయంగా ఛెస్ట్ కంప్రెషన్స్ అందించే అత్యాధునిక పరికరమని అల్ లో-బీర్ తెలిపారు. ఇది మెదడు, ఇతర కీలక అవయవాలకు రక్త ప్రసరణ కొనసాగించడంలో సహాయపడుతూ ప్రాణరక్షణలో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు నాయకత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమ విజయానికి తానా కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ రీజినల్ రిప్రజెంటేటివ్ సుధీర్ చంద్ర నారేపలుపు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి, ఫౌండేషన్ కోశాధికారి శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ సతీశ్ మేకా, ఎన్.జే. తానా కేర్స్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కల్వకోలు, తానా ఎన్.జే. టీమ్ స్క్వేర్ కోఆర్డినేటర్ రవి మాచర్ల, తానా వలంటీర్లు హరీశ్ కోయ, దశరథ్ తాళ్లపనేని, అలాగే స్థానిక హైస్కూల్ విద్యార్థిని, కెండల్ పార్క్ EMS వలంటీర్ వర్షా నారేపలుపు విశేషంగా కృషి చేశారు.

తానా నాయకత్వం వర్షా నారేపలుపు సేవలను ప్రత్యేకంగా అభినందించింది. స్థానిక హైస్కూల్ విద్యార్థినిగా ఉండి, EMS వలంటీర్‌గా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్న ఆమె యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొని సీపీఆర్ పద్ధతులను అభ్యసించారు. యువతలో సేవాభావం, అత్యవసర పరిస్థితులపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

సమాజానికి సేవ చేయడం తానా లక్ష్యం: రాజా కసుకుర్తి
తానా కేవలం సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదని.. సమాజానికి సేవ చేయడం, అవగాహన కల్పించడం, ప్రజలను శక్తివంతం చేయడం తమ ప్రధాన లక్ష్యమని తానా కోశాధికారి రాజా కసుకుర్తి వ్యాఖ్యానించారు. CPR, AED శిక్షణ వంటి కార్యక్రమాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగల నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు. ఉత్తర అమెరికా, భారతదేశంలో తానా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఆహార పంపిణీ, యువత అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, రైతు సహాయ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.

రెండేళ్ల క్రితం LUCAS పరికరాన్ని తానా అందించినప్పుడు తమ లక్ష్యం ఒక్కటేనని.. ప్రాణాలను కాపాడటమేనని తానా కోశాధికారి రాజా కసుకుర్తి చెప్పుకొచ్చారు. నేడు ఆ పరికరం ఈ ప్రాంతంలో ప్రాణాలను రక్షించడంలో ఎంతగానో ఉపయోగపడుతోందని చీఫ్ అల్ లో-బీర్ చెప్పడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సమాజ సేవ తానా ప్రధాన ధ్యేయమని ఉద్ఘాటించారు. ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధి, అత్యవసర సేవలు, రైతు సంక్షేమం, మానవతా సేవలు వంటి అనేక రంగాల్లో తానా తన సేవలను కొనసాగిస్తుందని వివరించారు. తానా అసలైన బలం తమ వలంటీర్లు అని చెప్పుకొచ్చారు. ప్రతి సేవా కార్యక్రమం విజయవంతం కావడానికి వారి అంకితభావం, నిస్వార్థ సేవే కారణమని తానా కోశాధికారి రాజా కసుకుర్తి తెలిపారు. రవి మాచర్ల, హరీశ్ కోయ, దశరథ్ తాళ్లపనేని, వర్షా నారేపలుపు, ఈ కార్యక్రమంలో భాగమైన ప్రతి వలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా వర్షా వంటి యువత సమాజ సేవలో ముందుండటం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఇలాంటి యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం తానా ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన చీఫ్ అల్ లో-బీర్, కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్, వలంటీర్లు, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తానా నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ఈ CPR & AED శిక్షణ కార్యక్రమం ద్వారా ప్రజారోగ్య అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం, యువతలో సేవా స్పూర్తి, సమాజ సాధికారతను పెంపొందించేందుకు తానా చేస్తున్న కృషికి ఇది మరో నిదర్శనంగా నిలిచిందని తెలిపారు.


ఈ వార్తలు చదవండి
డాలస్‌లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి మునిరత్నం నాయుడికి ఘనస్వాగతం
టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ పూర్తిచేసిన తానా బోర్డ్ చైర్మన్
Read Latest NRI News And AP News And International News And Telugu News