ఆకట్టుకున్న GWTCS వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా అనంత్ శ్రీరామ్
ABN , Publish Date - May 12 , 2026 | 05:50 PM
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారధ్యంలో సంగీత సాహిత్య హాస్యం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్, మే12 (ఆంధ్రజ్యోతి): అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా.. బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం నిర్వహించిన వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సారథ్యంలో సంగీత సాహిత్య హాస్యం (MLC) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఎన్నటికీ మరచిపోమని GWTCS అధ్యక్షులు రవి అడుసుమిల్లి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ప్రవాస తెలుగువారికి వినోదం, విజ్ఞానం, సాంస్కృతిక వారసత్వం అందించే లక్ష్యంతో మా సంస్థ పనిచేస్తుంది. మన తర్వాత తరం ఏదీ కొల్పోకూడదో.. దాని కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఈ తరంపై ఉంది. పాత జ్ఞాపకాలు మరచిపోయినా, వాటిని చెరిపివేసినా, భావితరాలు మనల్ని క్షమించవు. అందుకే ఈ తరానికి వాటిని అందించటానికి సంప్రదాయబద్ధంగా వీటన్నింటినీ రూపకల్పన చేశామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో భాగస్వాములయిన ప్రతిఒక్కరినీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. ‘తెలుగు వారి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ ఉట్టిపడేలాగా వివిధ రూపాల్లో కళలు, సాహిత్యం, సంస్కృతీ, ఆధ్యాత్మికతను జోడించి అనేక రూపాల్లో GWTCS వారు కార్యక్రమాలు రూపొందించారు. ప్రపంచంలోని తెలుగుదనాన్ని ఒక వేదికపైకి తీసుకొచ్చి తెలుగు భాషకు, తెలుగు జాతికీ గుర్తింపు తెచ్చారు. 52 సంవత్సరాల GWTCS ప్రస్థానంలో భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడుతూ, విశిష్టమైన పండుగలు, ఇతర వేడుకలు క్రమం తప్పకుండా సంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు’ అని వారు తెలిపారు. సాయికాంత రూపొందించిన నృత్యాలు, వివిధ సంగీత పాఠశాలలకు చెందిన చిన్నారుల నాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చక్కటి సంగీత, సాహిత్య, హాస్యాన్ని మేళవించి వినోదాన్ని అందించిన ప్రముఖ సినీ గేయ రచయితా అనంత శ్రీరామ్ బృందాన్ని ఘనంగా సత్కరించారు. పలురకాల వేషధారణతో.. చిన్నారుల పలు నృత్య కార్యక్రమాలు అన్నితరాల వారిని ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ ఘన సంప్రదాయాన్ని చాటి చెప్పే పలు రకాల తెలుగింటి వంటకాలతో విందు భోజనాలను అందించారు. పూర్వ అధ్యక్షులు త్రిలోక్ కంతేటి, మన్నే సత్యనారాయణ, సుధా పాలడుగు, కృష్ణ లాం, సంస్థ కార్యవర్గ సభ్యులు సుశాంత్ మన్నే, రాజేష్ కాసరనేని, భానుప్రకాశ్ మాగులూరి, శ్రీనివాస్ గంగ , విజయ్ అట్లూరి, యువ సిద్ధార్ధ్ బోయపాటి, పద్మజ బేవర , శ్రీవిద్య సోమ, పావని తదితరులు.. సభికులకు ధన్యవాదాలు తెలిపి.. బాషా, సంస్కృతీని కాపాడుకోవటం, కళను ప్రోత్సహించటం, కళాకారులను సత్కరించటం తెలుగింటి సంప్రదాయమని తెలిపారు..





ఈ వార్తలు చదవండి
మలేషియా తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
రాలీలో కన్నులపండువగా శ్రీ సీతారామ కల్యాణం.. భారీగా పాల్గొన్న ప్రవాస భారతీయులు
Read Latest NRI News And AP News And International News And Telugu News