Share News

బాల్టిమోర్‌లో ముగిసిన 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతి, సమైక్యతకు పట్టాభిషేకం

ABN , Publish Date - Aug 11 , 2026 | 09:02 PM

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి.

బాల్టిమోర్‌లో ముగిసిన 19వ ఆటా మహాసభలు.. తెలుగు సంస్కృతి, సమైక్యతకు పట్టాభిషేకం
AATA 19th Conference

బాల్టిమోర్ (అమెరికా): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు (జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు) అత్యంత వైభవంగా, కోలాహలంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి వేలాదిగా తెలుగు ప్రజలు తరలివచ్చారు. తెలుగు ప్రజలు భారీగా రావడంతో బాల్టిమోర్ నగరం ఓ మినీ తెలుగు సీమను తలపించింది. తెలుగు భాషాభిమానం, సామాజిక ఐక్యత, ఆర్థిక పురోగతి , భావితరాల చైతన్యానికి ప్రతీకగా ఈ మహాసభలు నిలిచాయి. ఈ మహాసభలకు హాజరైన ప్రతినిధులు ‘సూపర్ డూపర్ హిట్’గా అభివర్ణించారు. శోభాయమానమైన గ్రాండ్ బాంక్వెట్‌తో ప్రారంభమైన ఈ వేడుకలు ఆటా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ మైలురాయిగా నిలిచాయి.


జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం తెచ్చిన రాజకీయ దిగ్గజాలు..

ఈ మహాసభలకు అమెరికా జాతీయ రాజకీయ దిగ్గజాలతో పాటు భారతదేశానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్ మాట్లాడుతూ.. మేరీల్యాండ్, అమెరికా సమగ్ర అభివృద్ధిలో తెలుగు ప్రవాసుల పాత్రను కొనియాడారు. సాంకేతికత, వైద్యం, విద్య, వ్యాపారం, పౌరసేవల్లో తెలుగు వారి నిబద్ధతను అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ తన జీవిత ప్రయాణాన్ని షేర్ చేసుకున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా అమెరికన్ సమాజంలో ఉన్నత అవకాశాలను సాధించవచ్చని అరుణా మిల్లర్ సూచించారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ గజాలా ఎఫ్. హష్మీ తన హైదరాబాద్ బాల్య జ్ఞాపకాలైన పాతబస్తీ, చార్మినార్, లాడ్‌బజార్, హైదరాబాదీ బిర్యానీ, రైలు ప్రయాణాలను గుర్తుచేసుకుని ప్రేక్షకులను చప్పట్లు కొట్టేలా చేశారు. ప్రవాసులు పౌర, రాజకీయ ప్రక్రియల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.


తెలంగాణ అభివృద్ధిలో ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విచ్చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతి, మౌలిక వసతులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ రాష్ట్రాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ప్రవాస పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని భట్టి పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో తానా, నాట్స్, టీటీఏ, టీడీఎఫ్, ఏఏపీఐ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొని తెలుగు సమాజ ఐక్యతను చాటారు. అమెరికా సాయుధ దళాల్లో వీరోచితంగా సేవలందిస్తున్న తెలుగు మహిళలు, పురుషులను ఈ వేదికపై ఘనంగా సత్కరించడంతో సభ మొత్తం అత్యంత భావోద్వేగానికి గురవడమే కాకుండా, స్టాండింగ్ ఒవేషన్, కరతాల ధ్వనులతో వేదికను మార్మోగేలా చేశాయి.

AATA-1.jpg


వ్యాపార, సంస్కృతిక వేడుకలు

మూడు రోజుల పాటు విభిన్న కార్యక్రమాలతో కన్వెన్షన్ సెంటర్ సభా ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ వేదికలపై కవిత్వం, సాహిత్యం, సినిమా, చరిత్రపై సమగ్ర చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేదికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, వైద్యం, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగాల్లో అవకాశాలపై సీనియర్ పారిశ్రామికవేత్తలు, యువ స్టార్టప్ వ్యవస్థాపకులు విస్తృతంగా చర్చించారు. రెండో, మూడోతరాల తెలుగు-అమెరికన్ యువత కోసం సంస్కృతి, నెట్‌వర్కింగ్, నాయకత్వ నైపుణ్యాలు,కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలను నిర్వహించారు.


ఉర్రూతలూగించిన జానపదాలు..

తెలుగు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న జానపద గీతాలు ఈ వేదికకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. కాసర్ల శ్యామ్, మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, జనార్దన్ పన్నెల బృందం ఆలపించిన తెలంగాణ జానపద గేయాలు చప్పట్లతో మార్మోగాయి.


తారల సందడి.. కీరవాణి స్వర నీరాజనం

తెలుగు సినీ ప్రపంచానికి చెందిన ప్రముఖుల రాకతో వేడుకల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అడివి శేష్, హాస్యనటుడు రాజేంద్రప్రసాద్, మురళీధర్ గౌడ్, వరుణ్ సందేశ్, పూజా హెగ్డే, రీతూవర్మ, అనన్య నాగళ్ల, దివి వడ్త్యా అభిమానులతో ముచ్చటించారు. యువ నటుడు నవీన్ పొలిశెట్టి తన టైమింగ్ కామెడీ పంచ్‌లతో ప్రాంగణాన్ని నవ్వుల సంద్రంలో ముంచెత్తారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, గాయని సునీత, త్రీయరీ, ఆరెంజ్ స్ట్రీట్ బృందాల ప్రదర్శనల అనంతరం... ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ మహాసభలకు 'గ్రాండ్ ఫినాలే'గా నిలిచింది.


డాలస్‌లో 20వ మహాసభలు..

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బానాల, సతీశ్ రెడ్డి రామసహాయం, కోర్ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో వందలాదిమంది వలంటీర్లు భోజనం, రవాణా, లాజిస్టిక్స్ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించి అతిథుల మెప్పు పొందారు. ఈ మహాసభల ముగింపు సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ, 2028లో జరగబోయే 20వ ఆటా మహాసభలకు డాలస్ (టెక్సాస్) నగరం ఆతిథ్యం ఇవ్వబోతోందని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. బాల్టిమోర్ మహాసభలు కేవలం సదస్సులు కాదని.. తెలుగువారి గుర్తింపునకు ఓ గొప్ప వేడుక అని పలువురు అభివర్ణించారు. ఈ మహాసభలు కొత్త అవకాశాలకు వేదిక అని.. సంస్థలు, వృత్తులు, తరాలకు అతీతమైన ఐక్యతకు శక్తివంతమైన ప్రతీక అని పలువురు పేర్కొన్నారు.


ఈ వార్తలు చదవండి

డాలస్‌లో తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి మునిరత్నం నాయుడికి ఘనస్వాగతం

టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ పూర్తిచేసిన తానా బోర్డ్ చైర్మన్

Read Latest NRI News And AP News And International News And Telugu News

Updated Date - Aug 11 , 2026 | 09:47 PM