అఖిలేష్ అయోధ్య నుంచి నామినేషన్ వేస్తే నేనూ వేస్తా.. యోగి ఆదిత్యనాథ్ సవాల్
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:57 PM
అఖిలేష్ యాదవ్ అయోధ్య నుంచి నామినేషన్ వేస్తే తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని సీఎం యోగి ఆదిత్యనాథ్ బహిరంగ సవాల్ విసిరారు. ఎస్పీపై ఘాటు విమర్శలు చేశారు.
గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 19: అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటూ సమాజ్‌వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ విసిరిన సవాల్‌పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. అఖిలేష్ యాదవ్ అయోధ్య నుంచి నామినేషన్ దాఖలు చేస్తే, తాను కూడా అక్కడి నుంచే పోటీ చేస్తానని బహిరంగ సవాల్ విసిరారు. గురువారం (నవంబర్ 19) గోరఖ్‌పూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అయోధ్యలో ముఖాముఖి పోరుకు సిద్ధం
అయోధ్య నుంచి ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు యోగి కౌంటర్ ఇచ్చారు. 'మీరు అక్కడి నుంచి నామినేషన్ దాఖలు చేస్తే, నేను కూడా నామినేషన్ వేస్తాను. ముఖాముఖిగా, నేరుగా పోటీ ఎలా ఉంటుందో చూద్దాం' అని యోగి అన్నారు. అఖిలేష్ యాదవ్‌కు ఎదురుగా నిలబడి పోరాడే ధైర్యం లేదని, బలహీనమైన వ్యక్తి ఎప్పుడూ వెనుక నుంచే దాడి చేస్తాడని సీఎం ఎద్దేవా చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ మాఫియా శక్తులపై ఆధారపడి రాజకీయాలు చేస్తోందని యోగి ఆరోపించారు. గతంలో ఆ పార్టీ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలను అడ్డుకున్నారని, రాష్ట్రంలో మహిళలు, వ్యాపారుల భద్రతను ప్రమాదంలోకి నెట్టారని మండిపడ్డారు. 'సమాజ్‌వాదీ పార్టీ అంటేనే గూండాయిజం, అరాచకం, అల్లర్లు, కర్ఫ్యూలకు పర్యాయపదం. ప్రతి మాఫియా వారి మిత్రపక్షమే, వారు ఎల్లప్పుడూ ప్రజలను మోసం చేశారు' అని విమర్శించారు.
మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక
రాష్ట్రంలో నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. 'ఎవరైనా మాఫియాగిరీకి పాల్పడాలని ప్రయత్నిస్తే, ఆ మాఫియాను మట్టిలో కలిపేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కుక్క తోక ఎప్పటికీ వంకరగానే ఉన్నట్లు, ఈ గూండాలు, మాఫియాలు చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మారరు. మా ప్రభుత్వం సరిగ్గా అదే చేస్తోంది. ఇప్పటికే వారి ఆగడాలను అరికట్టాము, మళ్లీ వారిపై ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నాము' అని సీఎం స్పష్టం చేశారు.(Yogi Challenges Akhilesh on Ayodhya)
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..