సర్కారు బ్యాంకులకు లాభాల పంట
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:21 AM
ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ)కు లాభాల పంట పడుతోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్టుగా సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
2026-27 ప్రథమార్ధంలో రూ.1.10 లక్షల కోట్ల లాభం
16.9 శాతం వృద్ధి నమోదు
తొలిసారిగా రూ.300 లక్షల కోట్లు దాటిన వ్యాపారం
వరుసగా ఐదో ఏడాదిలోనూ మెరుగైన లాభదాయకత
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ)కు లాభాల పంట పడుతోంది. వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్టుగా సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రథమార్ధంలో ఈ బ్యాంకుల ఆర్థిక పనితీరు మెరుగుపడటమే ఇందుకు నిదర్శనం. ఈ కాలానికి బ్యాంకు ల మొత్తం నికర లాభం 16.9 శాతం వృద్ధితో రూ.1.10 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే మొత్తం వ్యాపారం మొదటిసారిగా రూ.300 లక్షల కోట్లను దాటడం విశేషం. 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబరు కాలంలో పీఎస్‌బీల మొత్తం వ్యాపారం 15.5 శాతం వృద్ధి చెంది రూ.301.6 లక్షల కోట్లకు చేరింది.
ఇందులో డిపాజిట్లు 13.1 శాతం పెరిగి రూ.165.2 లక్షల కోట్లకు చేరుకోగా.. రుణాలు 18.8 శాతం వృద్ధితో రూ.136.4 లక్షల కోట్లకు చేరుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇక పీఎస్‌బీల నిర్వహణ లాభం 13.9 శాతం పెరిగి రూ.1.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఆస్తులపై రిటర్ను వార్షిక ప్రాతిపదికన 3 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 1.11 శాతానికి చేరింది.
బ్యాంకుల లాభదాయకత వరుసగా ఐదో సంవత్సరంలోనూ మెరుగుపడింది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, రిస్క్ నిర్వహణ విధానాలను పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఇందుకు దోహదపడ్డాయి.
రుణాల వృద్ధి విషయానికి వస్తే.. రిటైల్ అడ్వాన్సుల్లో 17 శాతం, వ్యవసాయ రుణాల్లో 19.5 శాతం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రంగానికి రుణాలు 20.4 శాతం మేర పెరిగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. దేశ ఆర్థిక కార్యకలాపాలు, ఆంత్రప్రెన్యూర్‌షిప్, ఆర్థిక సమ్మిళితానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు అందిస్తున్న మద్దతును ఈ వృద్ధి సూచిస్తోందని తెలిపింది.
పీఎస్‌బీల ఆస్తుల నాణ్యత కూడా చాలా మెరుగుపడింది. స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) నిష్పత్తి చరిత్రాత్మక కనిష్ఠ స్థాయి 1.69 శాతానికి, నికర ఎన్‌పీఏ నిష్పత్తి 0.33 శాతానికి చేరింది.
కొత్త మొండి బకాయిలు తక్కువగా ఉండటం, రికవరీల్లో మెరుగుదల వంటివి బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగుపడటానికి అవకాశం కల్పించాయి.
అన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు 90 శాతానికి పైగా ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియోను కలిగి ఉన్నాయి.
మూలధన సామర్థ్యం విషయానికి వస్తే.. పీఎస్‌బీల క్యాపిటల్ అడెక్వసీ రేషియో (సీఆర్‌ఏఆర్) ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి వార్షిక ప్రాతిపదికన 93 బేసిస్ పాయింట్లు పెరిగి 16.89 శాతానికి చేరుకుంది. ఇది నియంత్రణ సంస్థలు నిర్దేశించిన కనీస ప్రమాణాలకన్నా మెరుగైన స్థాయిలో ఉంది.
బ్యాంకుల నిర్వహణ సామర్థ్యం కూడా మెరుగుపడింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వార్షిక ప్రాతిపదికన కాస్ట్-టు-ఇన్‌కమ్ రేషియో 191 పాయింట్లు తగ్గి 47.38 శాతానికి చేరుకుంది.
లాభదాయకతతో పాటు ఆస్తుల నాణ్యత, క్యాపిటల్ అడెక్వసీ, నిర్వహణ సామర్థ్యంలో మెరుగుదల అనేవి ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయడానికి, వికసిత్ భారత్ 2047 విజన్ కింద దేశ ఆర్థిక వృద్ధి లక్ష్యాలకు మద్దతుగా నిలిచేలా వాటిని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రభుత్వ సంస్కరణల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..