ఆ వీడియోతో వివాదం.. జూన్ 6 నిరసనపై పెరిగిన ఉత్కంఠ!
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:18 PM
ఢిల్లీలో ఈ నెల 6న తలపెట్టిన నిరసనకు ముందు సీజేపీకి చెందిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సీజేపీకి మద్దతుదారుడైన ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి ముందు కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి చెందిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. సీజేపీకి మద్దతుదారుడిగా ఉన్న ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చర్చనీయాంశమైంది.
ఈ వైరల్ వీడియోలో అమిత్ కుమార్ సింధ్ అనే వ్యక్తి నిరసనలో పాల్గొనే వారినుద్దేశించి మాట్లాడుతూ.. 'ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటే అక్కడే అల్లర్లు చెలరేగుతాయి' అని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. నిరసనకారులు తమ రక్షణ కోసం పెప్పర్ స్ప్రేలు, కర్రలు వంటి వాటిని వెంట తెచ్చుకోవాలని సూచించినట్లూ ఆ వీడియోలో ఉంది. పోలీసులు నిరసనను అడ్డుకునే అవకాశముందని, ఎలాంటి పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆ వీడియోలోని అత్యంత వివాదాస్పద భాగంలో.. 'ఇప్పటివరకు చాలా భరించాం. ఈసారి హద్దులు దాటుతాం. నేపాల్‌ను నిర్మిస్తాం' అని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఈనెల 6న భారత్‌కు రానున్నట్లు సమాచారం. అనంతరం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టేందుకు అనుమతులు కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోపై వివాదం చెలరేగినప్పటికీ.. తమ ఉద్యమం పూర్తిగా శాంతియుతంగానే సాగుతుందని అభిజీత్ దీప్కే అన్నారు. రాజ్యాంగంపై తనకు పూర్తి విశ్వాసముందని, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే హక్కు ఉందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా.. జూన్ 6కు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో.. నిరసన కార్యక్రమం శాంతియుతంగా, చట్టబద్ధమైన పరిమితుల్లోనే కొనసాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.
పరీక్షల ప్రశ్నపత్రాల లీకులు, ఉద్యోగ నియామకాల్లో అవకతవకల అంశాలపై చేపట్టిన ప్రచారాలతో.. సీజేపీకి మద్దతు పెరిగింది. నీట్, సీబీఎస్ఈ, సీయూఈటీ, ఎస్‌ఎస్‌సీ జీడీ వంటి పరీక్షలకు సంబంధించిన వివాదాల వల్ల దేశవ్యాప్తంగా సుమారు 95 లక్షల మంది యువత ప్రభావితమయ్యారని ఆ సంస్థ పేర్కొంటోంది.
ఇవీ చదవండి:
టీఎంసీకి మరో షాక్.. మేయర్ పదవికి దీదీ సన్నిహితురాలు గుడ్‌బై
ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..