Share News

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:43 PM

ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది..

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో గల ఫ్లోరిష్ స్టే రెస్టారెంట్‌లో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.


గురుగ్రామ్‌లోని సెక్టార్ 46కు చెందిన వివేక్ అగర్వాల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్.. మ్యాక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని పరామర్శించేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆయనతో పాటు తల్లి ప్రేమ్ లత, భార్య తర్జనీ అగర్వాల్, ఇద్దరు కుమార్తెలు జివిషా, వారియా, మరో ముగ్గురు బంధువులూ ఉన్నారు. వీరంతా బస చేసేందుకు.. ప్రమాదానికి గురైన ఫ్లోరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లో 2 గదులను బుక్ చేసుకున్నారు. వీరు అల్పాహారం తీసుకుంటుండగా ఒక్కసారిగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలిన ఏకైక వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివేక్ అగర్వాల్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్(80) మాత్రమే. ఒకే కుటుంబంలోని 8 మంది మరణించడంతో గురుగ్రామ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా.. డీఎన్‌ఏ టెస్టుల అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు పేర్కొన్నారు.


బుధవారం(జూన్ 3న) ఉదయం 8:30 గంటలకు ఆ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇరుకైన భవనం కావడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. ఎంట్రీ, ఎగ్జిట్ ఒకేచోట ఉండటంతో అందులో ఉన్నవారు తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. ప్రమాద సమయంలో అందులో సుమారు 40 మంది ఉన్నట్టు సమాచారం. వారిలో 21 మంది చనిపోగా.. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు కిటికీలు, భవనం పైనుంచి దూకి తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులే ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా సెంట్రల్‌ ఆసియా, ఆఫ్రికా నుంచి చికిత్స కోసం అక్కడికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

కాగా.. ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద ఆ హోటల్‌కు లైసెన్స్ మంజూరు చేసింది. దీని ప్రకారం.. ఆ ప్రాపర్టీలో 6 గదులకే అనుమతి ఉండగా.. బేస్‌మెంట్‌లోని కొన్ని గదులతోపాటు మొత్తం 25 గదులతో ఆ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

ట్రెక్కింగ్‌కు వెళ్లి యువతి మిస్సింగ్.. ఇద్దరు స్నేహితుల అరెస్ట్..

తమిళనాడులో ఫుడ్ పాయిజన్ కలకలం.. 100 మందికిపైగా అస్వస్థత

Updated Date - Jun 04 , 2026 | 01:02 PM