ట్రెక్కింగ్‌కు వెళ్లి యువతి మిస్సింగ్.. ఇద్దరు స్నేహితుల అరెస్ట్..
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:26 PM
స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. 6 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ దొరకలేదు. పోలీసులు ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
డెహ్రాడూన్, జూన్ 4: స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. 6 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ దొరకలేదు. పోలీసులు ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంతకీ జరిగిందేంటంటే.. ఉత్తరాఖండ్‌లోని నైనితాల్‌కు చెందిన బబితా పాండే అనే యువతి ఎంబీఏ చేస్తోంది. వారం రోజుల క్రితం ఆమె తన స్నేహితులు హర్మన్‌పాల్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్‌లతో కలిసి టూర్‌కు వెళ్లింది. మే 25వ తేదీన వారు హర్సిల్, గంగోత్రితో పాటు చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాల్లో తిరిగారు.
ముగ్గురూ మే 28వ తేదీన రైతాల్ గ్రామానికి వెళ్లారు. ఆ రోజు అక్కడే ఉన్నారు. మరుసటి రోజు రైతాల్ నుంచి దయారా బుగ్యాల్‌కు ట్రెక్కింగ్ మొదలెట్టారు. ఆ రాత్రి గోయ్ బేస్ క్యాంప్‌లో బస చేశారు. అర్థరాత్రి నుంచి బబిత కనిపించకుండాపోయింది. బబిత స్నేహితులు ఆమె కోసం వెతికారు. ఆమె ఎక్కడా కనిపించకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆర్మీ, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీస్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్కు చెందిన 150 మంది ఆమె కోసం వెతుకుతున్నారు.

అధికారులు స్నిఫర్ డాగ్స్, డ్రోన్స్‌ను కూడా రంగంలోకి దింపారు. అంతేకాదు.. ఆరుగురు గజ ఈతగాళ్లు గోయ్ క్యాంప్ సైట్ దగ్గర ఉన్న సరస్సులో వెతుకుతున్నారు. ఆరు రోజులు గడిచినా బబిత ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బబిత స్నేహితులు హర్మన్‌పాల్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. హత్య కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
జూన్ 4.. వైసీపీ విధ్వంసానికి ముగింపు.. అభివృద్ధి యుగానికి నాంది: మంత్రి మండిపల్లి
‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’గా ఏపీకి గౌరవం: మంత్రి కందుల దుర్గేష్