అధికారం సరే.. హామీల అమలే అసలు సమస్య
ABN , Publish Date - May 05 , 2026 | 01:44 PM
అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అధికారానికి చేరువైన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
చెన్నై: అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ అధికారానికి చేరువైన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఇచ్చిన హామీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నిజానికి ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అమలుకు తగినన్ని నిధుల్లేని పరిస్థితి. దీనికి తోడు విజయ్ కొత్తగా ఇచ్చిన హామీలు ఎలా అన్నదానిపై ప్రభుత్వ ఆర్థిక నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. ‘‘అర్హులైన పేద కుటుంబానికి ఏడాదికి ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు. 60 యేళ్లలోపు కుటుంబాన్ని పోషించే గృహిణుల బ్యాంక్ ఖాతాల్లో నెలనెలా రూ.2500 చెల్లింపు. నిరుపేదల యువతులకు వివాహం సందర్భంగా ఉచితంగా 8 గ్రాముల బంగారం.
ప్లస్-2 వరకు విద్యాభ్యాసం సాఫీగా సాగేందుకు వారి తల్లుల బ్యాంక్ ఖాతాలో ప్రతియేటా రూ.15వేల చెల్లింపు. ప్లస్-2 తర్వాత పీహెచ్‌డీ వరకు చదివే విద్యార్థులకు వడ్డీ లేకుండా రూ.20లక్షల వరకు విద్యారుణం. ప్రతి ఒక్కరికీ హెల్త్ చెకప్, సరసమైన ధరలకు మందుల అమ్మకం. 29 యేళ్లకు పైగా నిరుద్యోగులుగా ఉన్న పట్టభద్రులకు ప్రతినెలా రూ.4000, ప్లస్-2 చదివిన వారికి ప్రతినెలా రూ.2500 చెల్లింపు. విద్యార్థుల కోసం వంద కామరాజర్ స్పెషల్ స్కూళ్ల ఏర్పాటు. ఐదెకరాల విస్తీర్ణం కంటే తక్కువ భూములున్న రైతులు సహకార బ్యాంకుల్లో పొందిన పంట రుణాలు పూర్తిగా మాఫీ, ఐదెకరాల కంటే ఎక్కువ భూములున్న రైతులకు 50 శాతం పంట రుణాల మాఫీ.
రెండెకరాలకంటే తక్కువ భూములున్న రైతుల పిల్లల విద్యాఖర్చుల బాధ్యత ప్రభుత్వానిదే. అన్ని జిల్లాల్లో 6 నుండి 12 వరకు నాణ్యమైన విద్యనందించే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్పు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు యేడాదికి రూ.10వేల చెల్లింపు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షలదాకా ఆరోగ్య బీమా. ఏఐ ద్వారా ఉచిత పోటీపరీక్షల శిక్షణా కేంద్రం ఏర్పాటు. వరి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.3500 చెల్లింపు.
చెరకు టన్నుకు మద్దతు ధర రూ.4500 చెల్లింపు. చేనేత కార్మికులు ఉత్పత్తులు నేరుగా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించేలా ఈ-కామర్స్ బ్రాండ్ రూపకల్పన. ప్రముఖ నగరాల్లో చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలు, షోరూమ్‌లు ఏర్పాటు. చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబానికి ప్రతియేటా బ్యాంక్‌ల ద్వారా రూ.30 వేలు చెల్లింపు. చేనేతకార్మికులకు 500 యూనిట్లు, మరమగ్గాలకు 1500 యూనిట్ల ఉచిత విద్యుత్. ఐదేళ్లకు మించి సర్వీసులో కొనసాగే తాత్కాలిక ఉపాధ్యాయులు, నర్సుల ఉద్యోగాలు క్రమబద్ధీకరణ’’ వంటి హామీలను విజయ్ గతంలో ప్రకటించారు.
అయితే టీవీకే ప్రభుత్వం ఈ హామీలను మాత్రమే అమలు చేస్తుందా? లేక వీటితో పాటు డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న వాటిని కొనసాగిస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సిందే. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వ పథకాలు, టీవీకే ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే మాత్రం ప్రభుత్వానికి అసాధ్యమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీనిపై విజయ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సివుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
పంజాబ్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. రాఘవ్ చద్దా ధ్వజం
ట్రైన్ జర్నీ.. తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Read Latest Telangana News and National News