కార్తీకదీపంపై సుప్రీంకోర్టులో విజయ్ ప్రభుత్వం రివ్యూ పిటిషన్
ABN , Publish Date - Nov 23 , 2026 | 08:35 AM
మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 24న దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ శుక్రవారం (నవంబర్ 20) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మదురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద సంప్రదాయ కార్తీక దీపాన్ని వెలిగించేందుకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 24న దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ శుక్రవారం (నవంబర్ 20) సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తమిళనాడు హిందూ ధార్మిక, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు మద్రాస్ హైకోర్టు తీర్పులోని కొన్ని వ్యాఖ్యలపై స్టే విధిస్తూ, పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాదికి మాత్రమే దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి సంబంధించి సుప్రీంకోర్టు పలు కఠినమైన షరతులు కూడా విధించింది. సాధారణ భక్తులు, ప్రజలు, ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలకు అక్కడ అనుమతి లేదని స్పష్టం చేసింది. ఆలయ దేవస్థానం తరపున ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే దీపస్తంభం వద్దకు వెళ్లాలని ఆదేశించింది. ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతను మదురై జిల్లా కలెక్టర్కు అప్పగించింది. అవసరమైతే భద్రత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ను కూడా మోహరించవచ్చని పేర్కొంది.
ఇందువల్లే టీవీకే ప్రభుత్వం అభ్యంతరం
కార్తీక దీపాన్ని సంప్రదాయంగా ఉచ్చిపిళ్లయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలోనే వెలిగిస్తారని తమిళనాడు ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. వివాదాస్పదమైన రాతి స్తంభం వద్ద దీపం వెలిగించే సంప్రదాయం గతంలో లేదని తెలిపింది. ఆ దీపస్తంభం హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా అవులియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉందని, ఆ ప్రాంతంలో దీపం వెలిగించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తడంతోపాటు మతసామరస్యానికి విఘాతం కలిగే అవకాశం ఉందని టీవీకే ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఈనెల 24న దీపం వెలిగించేందుకు ఇచ్చిన అనుమతిని భవిష్యత్తులో శాశ్వత హక్కుగా పరిగణించరాదని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. మతపరమైన హక్కులకు సంబంధించిన విస్తృత అంశాలతో పాటు ప్రధాన కేసుపై జనవరిలో సమగ్ర విచారణ జరపనుంది.
బీజేపీ మండిపాటు
సుప్రీంకోర్టు ఆదేశాలను సమీక్షించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్పై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అభ్యంతరం తెలిపారు. టీవీకే ప్రభుత్వ వైఖరి హిందువులకు వ్యతిరేకంగా ఉందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తోందని ఆయన ఆరోపించారు. దీపస్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించడాన్ని ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోందని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు అనుమతిని సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుబడుతూ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి..
భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
రూ.13 లక్షల బ్రెజ్జాకు బదులుగా రూ.9.5 లక్షల కారు ఇచ్చారని.. పెళ్లినే రద్దు చేసుకున్న ఢిల్లీ పోలీస్..