Share News

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..

ABN , Publish Date - Nov 22 , 2026 | 03:45 PM

అరుణాచల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెద్ద సైనిక ఘర్షణకు దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు భారత్, చైనా సైనిక ఉన్నతాధికారులు రెండో విడత కీలక చర్చలు జరిపారు.

భారత్, చైనా కమాండర్ల భేటీ.. అరుణాచల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చర్చ..
India China Border Tensions

ఇంటర్నెట్ డెస్క్: భారత్, చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చకుండా ఇరు దేశాల కమాండర్లు సమావేశమయ్యారు. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెద్ద సైనిక ఘర్షణకు దారితీయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు భారత్, చైనా సైనిక ఉన్నతాధికారులు రెండో విడత కీలక చర్చలు జరిపారు. చలికాలం తీవ్రత పెరగకముందే సరిహద్దులో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడమే ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం (India China Border Tensions).


భారత సైన్యంలోని మూడో కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కాళియా ఈ చర్చల్లో భారత బృందానికి నేతృత్వం వహించారు. చైనా సైనిక ఉన్నతాధికారులు, ఇతర సైనిక ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి సైతం చర్చలకు హాజరయ్యారు. ఇరు దేశాల సైనికుల మధ్య స్పష్టమైన విధివిధానాలు రూపొందించడం, గస్తీ బృందాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా చూడటం, సమాచార మార్పిడి వ్యవస్థను నిరంతరం కొనసాగించడం వంటి అంశాలపై చర్చించారు (India China Military Talks).


ఇంతకు ముందు సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఇరు దేశాల సైనిక కమాండర్లు తొలి విడత చర్చలు జరిపారు (India China Border Dispute). అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబితూ ప్రాంతంలో ఉన్న వాచా-దమై సరిహద్దు సమావేశ కేంద్రంలో ఈ భేటీ జరిగింది. అప్పర్ సుబన్‌సిరి జిల్లాలోని తక్సింగ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో తొలి విడత చర్చలు జరిగాయి. ఇప్పుడు చలికాలం ప్రారంభానికి ముందు మరోసారి సమావేశమై పరిస్థితులను సమీక్షించారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 03:51 PM