ఇతర ‘రాష్ట్రాల్లో’ చేరొద్దంటూ ‘గైడెన్స్ తమిళనాడు’ ఉద్యోగులకు కొత్త రూల్స్!
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:06 AM
‘గైడెన్స్ తమిళనాడు’ ఏజెన్సీలో చేరే ఉద్యోగులకు కొత్త నిబంధనలు రూపొందించాలని తమిళనాడు పరిశ్రమల శాఖ నిర్ణయించింది.
చెన్నై, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘గైడెన్స్ తమిళనాడు’ ఏజెన్సీలో చేరే ఉద్యోగులకు కొత్త నిబంధనలు రూపొందించాలని తమిళనాడు పరిశ్రమల శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో పారిశ్రామిక సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించే పనులను పరిశ్రమల మంత్రిత్వ శాఖ, గైడెన్స్ తమిళనాడు నిర్వహిస్తున్నాయి. అయితే, ప్రభుత్వ మార్పు తర్వాత జూలైలో ఆ సంస్థలో విధుల్లో ఉన్న ఇద్దరిని తొలగించారు. ఆ ఇరువురితో సన్నిహితంగా మెలిగిన సంస్థలోని ఐదుగురు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ ఐదుగురు ప్రస్తుతం ఏపీ పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నారు. దీంతో, గతంలో తమిళనాడులో పెట్టుబడులకు ఆసక్తి చూపిన కంపెనీల వివరాలు లీక్ అయినట్లు ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ‘గైడెన్స్ తమిళనాడు’లో చేరే వారిపై కొత్త రూల్స్ విధించనున్నారు.