భారతీయ సంప్రదాయాలపై బీజేపీ, ఆరెస్సెస్లకు అవగాహన లేదు
ABN , Publish Date - Nov 23 , 2026 | 03:49 AM
భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాలపై బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సె్స)లకు ఏమాత్రం అవగాహన లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాలపై బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సె్స)లకు ఏమాత్రం అవగాహన లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఎలిఫెంటా గుహల్లోని శివపార్వతుల ‘అర్ధనారీశ్వర’ శిల్పం చిత్రాన్ని ట్యాగ్ చేసి ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు. తాను భారతీయ ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాల లోతుల్లోకి వెళ్లిన కొద్దీ ఒక విషయం మరింత స్పష్టమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు అనాగరిక, దురాశపర, కులతత్వ, పురుషాధిక్య భావజాలం కలిగినవని.. మన ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయాలపై వారికి కనీస అవగాహన లేదని ఆయన ఆరోపించారు. తల్లి సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అనుబంధం గురించి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతల విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ పోస్టు చేశారు.