విజయ్ సర్కార్
ABN , Publish Date - May 11 , 2026 | 05:39 AM
తమిళనాట ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల పాలనకు తెరపడింది. రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత తొలిసారి ద్రవిడ పార్టీయేతర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా...
తమిళనాడు సీఎంగా ‘ఇళయదళపతి’
విజయ్‌తో పదవీప్రమాణం చేయించిన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్
బుస్సీ ఆనంద్, ఆదవ్ అర్జున, సెంగోట్టయ్యన్, కీర్తన
సహా 9 మంది మంత్రులతో కూడా..
హాజరైన రాహుల్‌గాంధీ.. రాష్ట్ర కాంగ్రెస్, లెఫ్ట్, బీజేపీ నేతలు సైతం
చెన్నై నెహ్రూ స్టేడియానికి భారీగా వచ్చిన అభిమానులు, కార్యకర్తలు
వేదికపైనే ఉచిత విద్యుత్తు ఫైలుపై కొత్త ముఖ్యమంత్రి తొలిసంతకం
మహిళల టాస్క్‌ఫోర్స్, యాంటీ-నార్కోటిక్ ఫోర్స్ ఏర్పాటుపైనా..
తర్వాత సచివాలయంలో బాధ్యతలు.. ఉన్నతాధికారుల అభినందనలు
చెన్నై, మే 10 (ఆంధ్రజ్యోతి): తమిళనాట ఆరు దశాబ్దాల ద్రవిడ పార్టీల పాలనకు తెరపడింది. రాష్ట్రంలో 59 ఏళ్ల తర్వాత తొలిసారి ద్రవిడ పార్టీయేతర ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు.. ‘ఇళయదళపతి’ జోసెఫ్ విజయ్ ఆదివారం ఉదయం చెన్నై నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. వేల మంది సినీ అభిమానులు, పార్టీ శ్రేణులు, పార్టీ ప్రముఖులు, కార్యకర్తల హర్షధ్వానాల నడుమ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పదవీప్రమాణం చేయించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా హాజరయ్యారు. వేదికపై విజయ్‌కి కుడివైపు ఆయన, గవర్నర్ ఎడమవైపు ఆశీనులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్ ప్రమాణ స్వీకారోత్సవానికి అనుమతి ఇవ్వాలని కోరగా.. గవర్నర్ అంగీకారం తెలిపారు. ఆ తర్వాత గవర్నర్, విజయ్ మైకుల ముందు నిలిచారు. విజయ్.. ‘జోసెఫ్ విజయ్ ఎనుమ్ నాన్ (జోసెఫ్ విజయ్ అనే నేను) అని అనగానే స్టేడియం కరతాళ ధ్వనులు, ఈలలతో ప్రతిధ్వనించింది. ప్రమాణస్వీకారం మొదటి భాగాన్ని ఆయన కంఠస్థం చేసుకుని వచ్చారు. హావభావాలతో చేతులు పైకెత్తి, పిడికిలి బిగించి బిగ్గరగా చదివారు. రెండోభాగాన్ని చదివేందుకు సిద్ధమవుతుండగా.. ప్రతిని చూసి మిగతా సగభాగం ప్రమాణం చేయాలని గవర్నర్ సూచించారు. ఆ ప్రకారమే విజయ్ ప్రతిని చేతపట్టుకుని ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఆ తర్వాత వరుసగా మరో 9 మంది.. బుస్సీ ఎస్.ఆనంద్, ఆదవ్ అర్జునా, కేఏ సెంగోట్టయ్యన్, ఎస్.కీర్తన, కేజీ అరుణ్‌రాజ్, పి.వెంకటరమణన్, సీఆర్ నిర్మల్‌కుమార్, రాజ్‌మోహన్, టీకే ప్రభుతో గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఈ వేడుకలో టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై, సీపీఎం నేత షణ్ముగం, సీపీఐ నేత వీరపాండ్యన్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్, ఆ పార్టీ మహిళా నాయకురాలు తమిళిసై సౌందరరాజన్, వీసీకే, ఐఎంయూఎల్ నేతలు కూడా పాల్గొన్నారు. మాజీ సీఎంలు స్టాలిన్, పళనిస్వామి రాలేదు. అలాగే విజయ్ భార్య సంగీత, ఆయన కుమారుడు, కుమార్తె కూడా హాజరుకాలేదు.
మూడు ఫైళ్లపై తొలి సంతకాలు..
పదవీప్రమాణం చేసిన నెహ్రూ స్టేడియం వేదికపైనే సీఎం విజయ్ కీలకమైన మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ పథకంపై తొలి సంతకం.. మహిళల భద్రతకు కల్పించే దిశగా ‘సింగపెణ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు ఫైలుపై రెండో సంతకం.. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా మాదక ద్రవ్యాల నిరోధక దళం(యాంటీ-నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్) ఏర్పాటుకు సంబంధించిన ఫైల్‌పై మూడో సంతకం చేశారు. స్టేడియంలో ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత విజయ్ సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత సీఎం చాంబర్లోకి వెళ్లి ముఖ్యమంత్రి కుర్చీలో ఆశీనులై బాధ్యతలు స్వీకరించారు. కొన్ని ఫైళ్లపై సంతకాలు చేశారు. కాగా.. విజయ్‌కు ప్రత్యేక కార్యదర్శులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు సెంథిల్‌కుమార్, లక్ష్మీప్రియ నియమితులయ్యారు.
విజయ్ తల్లిదండ్రుల ఆనంద బాష్పాలు
విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం చూసి ఆయన తండ్రి, సినీ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్, తల్లి, ప్రముఖ గాయని శోభా చంద్రశేఖర్ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. జోసెఫ్ విజయ్ అనే నేను అని విజయ్ పలుకగానే ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేకపోయాయి. కాసేపు ఇరువురూ కళ్లు మూసుకుని ధ్యానం చేశారు. తర్వాత విజయ్ ప్రసంగిస్తూ.. తాను సాధారణమైన సినీ అసిస్టెంట్ డైరెక్టర్ కుటుంబం నుండి వచ్చానని అన్నప్పుడు కూడా ఆ దంపతులు ఉద్వేగానికి గురయ్యారు.
ప్యాంటు సూటుతో రిచ్‌లుక్‌లో విజయ్
ప్రమాణ స్వీకారం సందర్భంగా విజయ్ వస్త్రధారణ చర్చనీయాంశమైంది. గత సీఎంల సంప్రదాయ పంచెకట్టుకు స్వస్తి పలికిన టీవీకే అధినేత.. సరికొత్త ఫ్రెష్ లుక్‌లో దర్శనమిచ్చారు. చాలా స్మార్ట్‌గా తెల్ల చొక్కాపై నల్ల బ్లేజర్ (కోటు) ధరించి రిచ్‌లుక్‌తో మైదానంలో అడుగుపెట్టగానే అభిమానుల ఈలలు, కేకలతో నెహ్రూ ఇండోర్ స్టేడియం దద్దరిల్లింది. తమిళనాడు రాజకీయ చరిత్రలోనే ప్యాంట్, సూట్ ధరించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి నేతగా విజయ్ నిలిచారు. గతంలో కామరాజ్ నాడార్, అన్నాదురై, కరుణానిధి, నెడుంజెళియన్, ఎడప్పాడి పళనిస్వామి, ఎంకే స్టాలిన్ తమిళ సంప్రదాయ దుస్తులైన చొక్కా, ధోతీ ధరించి సీఎంలుగా ప్రమాణ స్వీకారాలు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంవీ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం జరిగిన లోక్‌భవన్‌లోనూ, వేప్పేరిలో ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ స్మారక స్థలం వద్ద నివాళులర్పించే కార్యక్రమంలోను విజయ్ అదే డ్రెస్ ధరించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్
జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. ఎంపీ శ్రీ భరత్ ధ్వజం
సింగపూర్ మోడల్‌లో ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ప్లాన్
Read Latest AP News And Telangana News And International News And Telugu News