రైల్వే శాఖతో పోరాడి విజయం సాధించిన విద్యార్థిని
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:44 PM
రైలు ఆలస్యం కారణంగా ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదంతా కష్టపడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆ విద్యార్థిని ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాడి చివరకు విజయం సాధించింది. అసలేం జరిగిందంటే..
ఉత్తర్‌ప్రదేశ్, జనవరి27: నిత్యం రైళ్లలో ఎంతో మంది ప్రయాణం చేస్తుంటారు. అయితే తరచూ రైళ్ల ఆలస్యం కారణంగా చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు ఇలా రైలు ఆలస్యం కావడం కొందరి జీవితాలను తలకిందులు చేస్తుంది. అచ్చం అలాంటి పరిస్థితే ఓ విద్యార్థినికి ఎదురైంది. ఎంట్రెన్స్ పరీక్ష కోసం ఓ విద్యార్థిని ఏడాదిపాటు పడిన శ్రమ వృథా అయింది. న్యాయం కోసం ఆమె ఏకంగా రైల్వే శాఖపైనే పోరాటానికి దిగింది. ఏడేళ్ల పాటు పోరాటం చేసి.. చివరకు విజయం సాధించింది. రైల్వే నుంచి రూ.9 లక్షల పరిహారం పొందింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అసలు ఈ విద్యార్థిని స్టోరీ ఏమిటో తెలుసుకుందాం..
యూపీలోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే విద్యార్ధిని 2018 మే7 బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ రైలుకు టికెట్ బుక్ చేసుకుంది. బస్తీ జిల్లా నుంచి ఆ రైలు ఉదయం 11 గంటలకు లఖ్‌నవూకు రావాల్సి ఉంది. కానీ రెండున్నర గంటలు ఆలస్యమై మధ్యాహ్నం 1:30 గంటలకు చేరింది. అయితే పరీక్షా కేంద్రంలో మధ్యాహ్నం 12.30 గంటల వరకే అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. దీంతో సదరు విద్యార్థిని ఆ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయింది. తీవ్ర మనోవేదన గురైన ఆమె.. న్యాయ పోరాటానికి దిగింది. రైలు ఆలస్యం కారణంగా పరీక్ష రాయకపోవడంతో తాను ఏడాది కాలాన్ని నష్టపోయానంటూ జిల్లా వినియోగదారుల కమిషన్‌కు(Consumer commission) ఫిర్యాదు చేసింది.
ఈ నష్టానికి గానూ తనకు రూ.20 లక్షల పరిహారం చెల్లించాలని కమిషన్‌ను కోరింది. దీనిపై విచారణ జరిపిన కమిషన్.. రైల్వే శాఖకు నోటీసులు జారీ చేసింది. రైల్వే శాఖ కూడా ఇంటర్‌సిటీ సూపర్ ఫాస్ట్ రైలు ఆలస్యమైందనే విషయాన్ని ధ్రవీకరించింది. అయితే అందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా ఈ కేసు విచారణ దాదాపు ఏడేళ్ల పాటు కొనసాగింది. తాజాగా వినియోగదారుల కమిషన్ సమృద్ధికి రూ.9.10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఆ సొమ్మును 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఆలస్యం చేస్తే చెల్లింపులో 12 శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన అకీరా నందన్
ఎన్టీఆర్ భవన్‌లో పార్లమెంటరీ కమిటీల శిక్షణ.. ప్రధానంగా వాటిపైనే