నా ప్రాణాలకు ముప్పు ఉంది.. షకీల్ అహ్మద్
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:02 PM
జనవరి 27న తన ఇంటిపై దాడికి ప్లాన్ చేసినట్టు కొందరు కాంగ్రెస్ పార్టీ సన్నిహితులు చెప్పారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షకీల్ అహ్మద్ తెలిపారు. తన వాదనకు సాక్ష్యంగా వాట్సాప్ మెసేజ్‌లను కూడా ఆయన పోస్ట్ చేశారు.
పాట్నా: యువజన కాంగ్రెస్ కార్యకర్తల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని, పాట్నా, మధుబనిలోని తన ఇళ్లను టార్గెట్ చేయాలని కార్యకర్తలకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలిచ్చిందని ఆ పార్టీ మాజీ నేత షకీల్ అహ్మద్ (Shakeel Ahmad) ఆరోపించారు. దీంతో పాట్నాలోని ఆయన నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసారు. జనవరి 27న తన ఇంటిపై దాడికి ప్లాన్ చేసినట్టు కొందరు కాంగ్రెస్ పార్టీ సన్నిహితులు చెప్పారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన తెలిపారు. తన వాదనకు సాక్ష్యంగా వాట్సాప్ మెసేజ్‌లను కూడా ఆయన పోస్ట్ చేశారు.
పార్టీలో పూర్తి అథారిటీ రాహుల్‌దేనని, తన ఇంటిపై దాడులకు ఆయన అనుమతించారని అహ్మద్ ఆరోపించారు. రాహుల్‌ను అమిత్‌షా ప్రతిరోజూ విమర్శిస్తుంటారని, వాటిపై రాహుల్ ఎందుకు స్పందించరని నిలదీసారు. పైగా తాను ఇప్పుడు కాంగ్రెస్‌లో కూడా లేనని చెప్పారు. ఇటీవల తాను కాంగ్రెస్‌ను వదిలిపెట్టినప్పటికీ ఆ పార్టీపై తనకెలాంటి శత్రుత్వం లేదని, తాను పార్టీ మద్దతుదారుగానే ఉంటానని తెలిపారు. ఏ పార్టీలోనూ చేరే ఆలోచన లేదని కూడా వివరణ ఇచ్చారు. తన చివరి ఓటు కూడా కాంగ్రెస్‌కే పడుతుందని చెప్పారు.
రాహుల్‌పై వ్యాఖ్యల వివాదం
షకీల్ అహ్మద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీని పిరికివాడుగా, అభద్రతాభావం కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుంటారని, ప్రజాస్వామికవాది కాదని అన్నారు. 2019లో సొంత నియోజకవర్గమైన అమేథీ నుంచి రాహుల్ ఓడిపోవడానికి కూడా ఆయన వ్యవహారశైలే కారణమని అన్నారు. బిహార్ నుంచి మూడు సార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా అహ్మద్ పనిచేశారు. గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ కూటమితో కలిసి పోటీచేసిన కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో కేవలం ఆరు స్థానాల్లో గెలిచింది.
ఇవి కూడా చదవండి..
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
అసత్యాలెందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రధానిపై సీఎం స్టాలిన్ మండిపాటు
Read Latest National News