భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:33 AM
భారత్ - ఐరోపా సమాఖ్య(ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. గోవాలో ఇండియా ఎనర్జీ వీక్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ఈ ట్రేడ్ డీల్ వివరాలు చెప్పారు మోదీ.
న్యూఢిల్లీ, జనవరి 27: భారత్ - ఐరోపా సమాఖ్య(ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం(జనవరి 26న) ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపారు. ప్రపంచ దేశాలు దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అని చర్చించుకుంటున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు గోవాలో ఇండియా ఎనర్జీ వీక్(IEW)-2026ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ఈ ట్రేడ్ డీల్ గురించి ఆయన వివరించారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా భారత్ అవతరించనుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. 2030 నాటికి చమురు, గ్యాస్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడే లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) వాణిజ్య ఒప్పందంతో తయారీ రంగంలో వృద్ధి సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణ గోవా జిల్లాలోని బేతుల్ గ్రామం వేదికగా ఈ సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు వివిధ దేశాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు.
ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పెట్టుబడులను సమీకరించడంతోపాటు డీ కార్బనైజేషన్ అమలు చేయడం కోసం ఆచరణాత్మకమైన అంశాలను ముందుకు తీసుకు వెళ్లడంపై ఈ ఇండియా ఎనర్జీ వీక్ సదస్సు దృష్టి సారిస్తోంది. అంతేకాకుండా.. ప్రపంచ ఇంధన దౌత్యంలో ఈ సదస్సు ద్వారా ప్రాధాన్యత పెరుగుతోందని భారత్ భావిస్తోంది.
ఈ సదస్సుకు 120కి పైగా దేశాల నుంచి 75000 మందికిపైగా ఇంధన నిపుణులను ఇండియా ఎనర్జీ వీక్ ఆహ్వానించిన విషయం విదితమే. గతేడాది నిర్వహించిన ఇదే సదస్సులో 68 వేల మంది పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
జన నాయగన్ చిత్రంపై హైకోర్టు కీలక నిర్ణయం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్ష భేటీ
For More National News And Telugu News