జన నాయగన్ చిత్రంపై హైకోర్టు కీలక నిర్ణయం
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:44 PM
'జన నాయగన్' తాను నటించే చివరి చిత్రమని తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
చెన్నై, జనవరి 27: సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జన నాయగన్' చిత్రానికి మరోసారి చుక్కెదురైంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. దీనిపై మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది. సెన్సార్ బోర్డుకు తన వాదనలు వినిపించడానికి న్యాయపరమైన అవకాశాలివ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ వ్యవహారాన్ని రివైజింగ్ కమిటీకి పంపిన నిర్ణయంపై స్వేచ్ఛగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్ జడ్జికి మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. మరోసారి విచారించి ఆదేశాలు జారీచేసే అధికారం సింగిల్ బెంచ్‌కు ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది.
మరోవైపు జన నాయగన్‌కు U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటూ సెన్సార్ బోర్డుకు జనవరి 9న మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు ఆప్ ఫిల్మ్ సర్టిఫికేట్(CBFC).. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికెట్ జారీపై తాత్కాలిక స్టే విధించింది న్యాయస్థానం. ఈ స్టేను సవాల్ చేస్తూ.. నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే ఈ చిత్రం విడుదలపై జోక్యం చేసుకోవడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై మద్రాసు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని సినీ నిర్మాతలకు సూచించింది. దీంతో హైకోర్టు.. ఇటీవల డివిజన్ బెంచ్ వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై మరోసారి విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలంటూ సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. అఖిలపక్ష భేటీ
For More National News And Telugu News