అసత్యాలెందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రధానిపై సీఎం స్టాలిన్ మండిపాటు
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:14 AM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటీవల తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 27: తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్.. ప్రధాని నరేంద్ర మోదీపై ఎదురు దాడికి దిగారు. ప్రధాని ఇటీవల డీఎంకే ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. దేశంలో మహిళల భద్రత, మణిపుర్ హింస తదితర అంశాలను ప్రస్తావిస్తూ.. మోదీ పాలనపై ప్రశ్నల వర్షం కురింపించారు. అదే సమయంలో తమ ప్రభుత్వ ద్రవిడియన్ అభివృద్ధి నమూనానూ సమర్థించుకున్నారాయన.
తంజావూర్‌లో జరిగిన డీఎంకే మహిళా సమావేశంలో.. తమిళనాడులో మహిళలు సురక్షితంగా ఉన్నామని భావించడంలేదని ఇటీవల ప్రధాని చేసిన విమర్శలపై స్టాలిన్ విరుచుకుపడ్డారు. ఈ అభియోగాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. మోదీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారన్నారు.
'తమిళనాడులో మహిళలకు భద్రత లేదా? ఆయన ఎలాంటి సంకోచం లేకుండా ఎలా అబద్ధం చెబుతున్నారో చూడండి. ప్రధాని గారూ.. నేను సగర్వంగా మీకు చెబుతున్నాను.. తమిళనాడు మహిళలకు అత్యంత సురక్షితమైన ప్రదేశం' అని స్టాలిన్ చెప్పారు. అత్యధిక స్థాయిలో మహిళలు ఉద్యోగాలు చేస్తున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటని సీఎం చెప్పుకొచ్చారు.
మణిపుర్‌ను పరిగణనలోకి తీసుకున్న స్టాలిన్.. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండ నిర్మూలించి, శాంతిని పునరుద్ధరించడంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 'మీరు మణిపుర్‌ను మరిచిపోయారా? ప్రభుత్వ అంచనాల ప్రకారం.. సుమారు 260 మంది మరణించారు. మరో 3,000 మంది గాయపడ్డారు. లక్షకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ సాధారణ స్థితిని ఎందుకు పునరుద్ధరించలేకపోయింది?' అని స్టాలిన్ విమర్శనాస్త్రాలు సంధించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హింసను ప్రశ్నించినా బెదిరింపులే!
Read Latest Telangana News and National News