మేమేమన్నా బిచ్చగాళ్లమా? ఎస్పీపై కాంగ్రెస్ మండిపాటు
ABN , Publish Date - Nov 25 , 2026 | 12:31 PM
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనుకుంటున్న కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ ఎన్నికల్లో కనీసం 120 సీట్లకు తక్కువ కాకుండా ఇవ్వాలని ఎస్పీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలనుకుంటున్న కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఆ ఎన్నికల్లో కనీసం 120 సీట్లకు తక్కువ కాకుండా ఇవ్వాలని ఎస్పీని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే, తమకు 26 సీట్లు మాత్రమే ఆఫర్ చేయడంతో ఎస్పీపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. సీట్లపై చర్చలు కొనసాగుతుండగానే ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ఎస్పీ ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ, యూపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మేం అడగకుండానే 26 సీట్లు ప్రకటించారు. మేం బిచ్చగాళ్లమా?’ అని మండిపడ్డారు. పొత్తుపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఆశించిన సీట్లలో ఎస్పీ అభ్యర్థులు
సహరాన్పూర్ సిటీలో రెండు సీట్లు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ కోరగా.. అప్పటికే ఎస్పీ తన ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. ఓ వైపు సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తుండగానే ఎస్పీ తన అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. 120 కన్నా తక్కువ సీట్లలో పోటీచేసే ప్రసక్తే లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రాయ్ బరేలీ, అమేథీ జిల్లాలతో పాటు తాము కోరిన వివిధ నియోజకవర్గాల సీట్లు తమకు ఇవ్వాలని కాంగ్రెస్ పట్టబడుతోంది. మరోవైపు సహరాన్‌పూర్‌లోని రెండు సీట్లు, కైరానా, అమ్రోహా, లలిత్పూర్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. ఆ సీట్లను సిటింగ్ ఎమ్మెల్యేలకే కేటాయించింది.
బీజేపీని ఓడించే సామర్థ్యం ఉన్నవారికే సీట్లు
ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఎక్స్‌లో సుదీర్ఘంగా ఒక పోస్టు చేశారు. బీజేపీని ఓడించే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మిత్రపక్షం కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని, అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేసేటపుడు గెలిచే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
విద్యార్థినికి టీచర్ అసభ్యకర సందేశాలు.. అరెస్టు
ఢిల్లీలో మహిళపై సహోద్యోగుల గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్టు