2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు: SP, కాంగ్రెస్ మధ్య సీట్ల బేరాలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 03:20 PM
2027 యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 2: ఉత్తర్ ప్రదేశ్ 2027 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ (SP), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించి కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పొత్తు చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, రెండు పార్టీలు తమ బలాబలాలు బేస్ చేసుకుని తమ తమ డిమాండ్లను ముందస్తుగానే తెరపైకి తెస్తున్నాయి.
కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, సహారన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ వంటి కీలక నేతలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 150 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని బహిరంగంగానే ప్రతిపాదిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల విజయం తెచ్చిన ఉత్సాహంతో, ఎస్పీపై ఒత్తిడి పెంచి ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అయితే కాంగ్రెస్ డిమాండ్ అంగీకరించేందుకు సమాజ్‌వాదీ పార్టీ సుముఖంగా లేదు. గత ఎన్నికల పనితీరు, క్షేత్రస్థాయి బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటూ కాంగ్రెస్‌కు 53 నుంచి 55 సీట్లు మాత్రమే కేటాయించాలని ఎస్పీ భావిస్తోంది. మిగిలిన 350 కి పైగా స్థానాల్లో తామే స్వయంగా పోటీకి దిగాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ వ్యూహరచన చేస్తోంది.
గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. ఈ 6 లోక్‌సభ స్థానాల పరిధిలోకి దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. పోటీ చేసి ఓడిపోయిన ఇతర లోక్‌సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్‌కు దాదాపు 11 అసెంబ్లీ స్థానాల్లో మంచి ఓటు బ్యాంక్ నమోదైంది. ఈ అసెంబ్లీ స్థాయి ఓటింగ్ గణాంకాలను ప్రాతిపదికగా తీసుకునే ఎస్పీ కాంగ్రెస్‌కు 53-55 సీట్ల ఆఫర్‌ను సిద్ధం చేసింది.
ఎస్పీ 2024లో 37 లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతో పాటు మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. అందుకే 350 స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులే బరిలో ఉండాలని భావిస్తోంది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎస్పీ-కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. నాటి ఫలితాల అనుభవాన్ని కూడా ఎస్పీ ప్రస్తుతం పరిగణనలోకి తీసుకుంటోంది. 2017లో కాంగ్రెస్‌కు 105 సీట్లు కేటాయించినప్పటికీ, కేవలం 7 స్థానాల్లోనే కాంగ్రెస్ విజయం సాధించగలింది. అందుకే ఈసారి కాంగ్రెస్‌కు పరిమిత సంఖ్యలోనే సీట్లు ఇవ్వాలని ఎస్పీ పట్టుబడుతోంది. రాబోయే రోజుల్లో ఇరు పార్టీల సీనియర్ నాయకులు ముఖాముఖి చర్చలు జరిపిన తర్వాతే ఇండియా కూటమి తుది సీట్ల పంపకాలపై స్పష్టత రానుంది.
ఇవి కూడా చదవండి..
నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్
మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..