Share News

175 స్థానాలు ఆశిస్తున్న కాంగ్రెస్.. యూపీలో సీట్ల పంపకాలపై మొదలైన చర్చ..

ABN , Publish Date - Oct 24 , 2026 | 09:44 AM

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయి.

175 స్థానాలు ఆశిస్తున్న కాంగ్రెస్.. యూపీలో సీట్ల పంపకాలపై మొదలైన చర్చ..
Akhilesh Yadav, Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మధ్య సీట్ల పంపకాలపై చర్చలు మొదలయ్యాయి. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయి. యూపీలో 175 నుంచి 200 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఆ మేరకు ప్రాథమిక జాబితాను ఎస్పీ నేతలకు అందించినట్లు కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ తెలిపారు (UP Elections 2027).


ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో తమకు 175 నుంచి 200 సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. 2017 ఎన్నికల్లో ఏడు స్థానాలను గెలుచుకుంది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు కొత్త ఆశలు కల్పించాయి. ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 37 స్థానాలు, కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు (Congress Samajwadi Party Alliance).


కేవలం ఎక్కువ స్థానాలు కోరడం కాకుండా, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఉన్నాయో పరిశీలించి సీట్లను ఆశిస్తే మంచిదని ఎస్పీ నేతలు చెబుతున్నారు (Congress Seat Sharing). అయితే యూపీలో బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న అఖిలేష్.. కాంగ్రెస్‌కు సముచిత స్థాయిలోనే సీట్లను కేటాయించే అవకాశం కనబడుతోంది. రెండు పార్టీల అగ్రనేతలు త్వరలో సమావేశమై సీట్ల పంపకాలపై వివరంగా చర్చించనున్నారు. పరస్పర అంగీకారంతో సముచితమైన ఒప్పందం కుదురుతుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

అమెరికా మధ్యంతర ఎన్నికలు.. కెనడాకు ట్రంప్ ఊరట..


మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 24 , 2026 | 09:55 AM