సైనికుడి పార్థివదేహాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదం.. నలుగురి మృతి
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:52 PM
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ(ఆదివారం) ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో పాటు అంబులెన్స్ డ్రైవర్ దుర్మరణం చెందారు. చండీగఢ్‌లో విధులు నిర్వర్తిస్తూ కన్నుమూసిన ఆర్మీ మేజర్ సత్యవాన్ పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. యూపీ పోలీసుల కథనం ప్రకారం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేఓరియా జిల్లా రుద్రపూర్ ప్రాంతానికి చెందిన సుబేదార్ మేజర్ సత్యవాన్ భౌతికకాయాన్ని చండీగఢ్ నుంచి ఆయన స్వగ్రామానికి ఆర్మీ అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్య-సుల్తాన్‌పూర్ సరిహద్దు సమీపంలోని హాలియాపూర్ వద్ద ఉదయం 8 గంటల ప్రాంతంలో వేగంగా వెళ్తున్న అంబులెన్స్ నియంత్రణ కోల్పోయి, రహదారి పక్కన నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు అంబులెన్స్ ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో సుబేదార్ మేజర్ కుమారుడు గౌరవ్ సింగ్ (28), అంబులెన్స్ డ్రైవర్ జస్పాల్ (30) ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన సైనికుడి సోదరుడు రాజన్ చౌదరి (35), మేనల్లుడు రామ్ సముజ్ సింగ్ (40)లను అయోధ్య జిల్లా పిత్లా-కుమార్గంజ్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు మరణించారు.
సమాచారం అందుకున్న సుల్తాన్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్ ఇంద్రజిత్ సింగ్, ఎస్పీ వినీత్ జైస్వాల్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సుబేదార్ మేజర్ పార్థివదేహాన్ని హాలియాపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సైనికుడి మృతితో పాటు ఒకే కుటుంబంలోని మరో ముగ్గురు మరణించడంతో స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడా చదవండి:
మీకెందుకు ఇబ్బంది.. స్టాలిన్ 'షూటింగ్' వ్యాఖ్యలకు సీఎం విజయ్ ఘాటు కౌంటర్..
ప్రకృతి సాగులో ఏపీ నంబర్ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు
రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!