Share News

అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవు... సీపీఎం వార్నింగ్‌పై టీవీకే

ABN , Publish Date - May 20 , 2026 | 03:02 PM

అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం తోసిపుచ్చింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది.

అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవు... సీపీఎం వార్నింగ్‌పై టీవీకే
Vijay with Aadhav Arjuna

చెన్నై: అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారనే ఊహాగానాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తోసిపుచ్చింది. తమ ప్రభుత్వానికి అన్నాడీఎంకేతో ఎలాంటి పొత్తులు లేవని స్పష్టం చేసింది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వానికి మద్దతు కొనసాగించే విషయాన్ని పునరాలోచిస్తామంటూ సీపీఎం హెచ్చరికల నేపథ్యంలో టీవీకే తాజా వివరణ ఇచ్చింది. సీపీఎం, వీసీకేతో సహా మూడు పార్టీలను ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానించిన విషయాన్ని టీవీకే నేత, ప్రజాప్రనులు, క్రీడా శాఖ మంత్రి ఆధవ్ అర్జున గుర్తు చేశారు.


అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం వారం రోజుల సస్పెన్స్‌కు తెరదించుతూ సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు టీవీకేకు మద్దతు ప్రకటించాయి. అయితే అసెంబ్లీలో ప్రభుత్వ బలపరీక్షకు అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడంతో ఆ వర్గానికి ప్రభుత్వంలో చోటు కల్పిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే వర్గం ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీవీకే ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ పార్టీ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతుపై పునరాలోచన చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం ఇటీవల హెచ్చరించారు. డీఎంకే, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని, అన్నాడీఎంకే సపోర్ట్ తీసుకున్నా, అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగించాలనుకున్నా ప్రజా తీర్పును వమ్ము చేసినట్టేనని అన్నారు. తమిళనాడు మరోసారి ఎన్నికలకు సిద్ధంగా లేకపోవడం, గవర్నర్ పాలన ద్వారా బీజేపీ దొడ్డిదారిన తమిళనాడులో అడుగుపెట్టడం ఇష్టంలేకనే తాము టీవీకేకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.


మంత్రివర్గ విస్తరణపై..

కాగా, మంత్రివర్గం విస్తరణపై ఆధవ్ అర్జునను మీడియా ప్రశ్నించగా, త్వరలోనే దీనిపై టీవీకే బాస్ విజయ్ ఒక ప్రకటన చేస్తారని సమాధానమిచ్చారు. ఐదు సీట్లతో టీవీకే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్‌కు చోటు కల్పించే అవకాశాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇద్దరేసి ఎమ్మెల్యేలు కలిగిన సీపీఎం, వీసీకే, సీపీఐ, ఐయూఎంఎల్ పార్టీలు టీవీకే ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తున్నాయి. ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆ పార్టీలను ముఖ్యమంత్రి పలుమార్లు ఆహ్వానించిట్టు ఆధవ్ అర్జున చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు టీవీకే భాగస్వామ్య పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని అన్నారు. బీజేపీతో పొత్తుపెట్టుకోవాలని అన్నాడీఎంకే పార్టీ బాస్ పళనిస్వామి నిర్ణయమే ఆ పార్టీ ఓటమికి కారణమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఎంకేతో పొత్తుతో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంపై అడిగినప్పుడు, డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం తప్పని అన్నాడీఎంకే క్యాడర్ గ్రహించినందునే వారు టీవీకేకు సపోర్ట్ చేశారని అన్నారు. అన్నాడీఎంకే రెబల్ వర్గం నేత సీవీ షణ్ముగం నాయకత్వంలోని 25 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో టీవీకేకు మద్దతు ఇవ్వడంపై మాట్లాడుతూ, ఎవరికి మద్దతివ్వాలో నిర్ణయించుకునే హక్కు ఎమ్మెల్యేలకు ఉంటుందని ఆధవ్ అర్జున చెప్పారు.


ఇవి కూడా చదవండి..

అలా చేస్తే మద్దతుపై పునరాలోచిస్తాం.. విజయ్‌కు సీపీఎం వార్నింగ్

కులగణనపై సీజేఐ ధర్మాసనం కీలక తీర్పు

Updated Date - May 20 , 2026 | 03:35 PM