ఎల్టీటీఈ ప్రభాకరన్‌కు విజయ్ నివాళులు
ABN , Publish Date - May 20 , 2026 | 02:52 AM
తమిళనాడు సీఎం విజయ్ నిషేధిత సంస్థ ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’ (ఎల్టీటీఈ) వ్యవస్థాపకుడు వి.ప్రభాకరన్‌కు నివాళులర్పించడం వివాదానికి దారి తీసింది.
తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన బీజేపీ
చెన్నై, మే 19 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్ నిషేధిత సంస్థ ‘లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం’ (ఎల్టీటీఈ) వ్యవస్థాపకుడు వి.ప్రభాకరన్‌కు నివాళులర్పించడం వివాదానికి దారి తీసింది. ‘ముల్లివైక్కల్ జ్ఞాపకాలను మన హృదయాల్లో పదిలపరుచుకుందాం.. సముద్రానికి అవతలి వైపు నివసిస్తున్న మన తమిళ సోదర సోదరీమణుల హక్కులకు ఎల్లప్పుడూ మద్దతు ఇద్దాం’ అంటూ విజయ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉత్తర శ్రీలంకలోని ముల్లైదీవు జిల్లాలోని ముల్లివైక్కల్ తీరప్రాంత గ్రామంలో, 2009 మే 18న శ్రీలంక ప్రభుత్వ బలగాలకు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ)కి మధ్య జరిగిన అంతిమ పోరాటంలో ఆ ఒక్క గ్రామంలోనే వేల మంది తమిళ ప్రజలు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, యుద్ధంలో మరణించిన తమ బంధువులను స్మరించుకుంటూ ఏటా మే 18న ‘ముల్లివైక్కల్’ స్మారక దినంగా ఆచరిస్తుంటారు. ఈ సందర్భంగా విజయ్ ముల్లివైక్కల్ మృతులకు నివాళులర్పించడం చర్చనీయాంశమైంది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత అమిత్ మాలవ్య మాట్లాడుతూ.. ‘‘మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య చేసిన సంస్థ అధినేతకు విజయ్ నివాళులర్పించడమేంటి? అయినా కాంగ్రెస్‌కు, ఆ పార్టీ నేత రాహుల్‌గాంధీకి దీనిపట్ల ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ పార్టీకి అధికారంలో వాటా లభిస్తోంది కదా’’ అని విమర్శించారు.