Share News

PM Modi: తృణమూల్‌ను సాగనంపేందుకు సమయం వచ్చింది: ప్రధాని మోదీ

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:29 PM

పశ్చిమ బెంగాల్‌లో అవినీతి కారణంగా కేంద్ర పథకాల ప్రయోజనాలు పేద ప్రజలకు చేరడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. రాష్ట్రంలోని పేదలందరికీ సొంత ఇళ్లు, ఉచిత రేషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తన కోరిక అని అన్నారు.

PM Modi: తృణమూల్‌ను సాగనంపేందుకు సమయం వచ్చింది: ప్రధాని మోదీ
PM Modi

మాల్దా: బెంగాల్ ప్రజల పట్ల ఏమాత్రం కనికరం లేని అధికార తృణమూల్ కాంగ్రెస్(TMC) ప్రభుత్వాన్ని సాగనంపే సమయం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. బీజేపీ అభివృద్ధి మోడల్‌ను జెన్‌జీ(Gen Z) తరం విశ్వసిస్తోందని.. ఈసారి బెంగాల్ ప్రజలు మార్పు కోరుతూ బీజేపీకి పట్టం కడతారనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. బృహన్ ముంబై ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అనంతరం తొలిసారి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.


రాష్ట్రంలో అవినీతి కారణంగా కేంద్ర పథకాల ప్రయోజనాలు.. పేద ప్రజలకు చేరడం లేదని ప్రధాని ఆరోపించారు. బెంగాల్‌లోని పేదలందరికీ సొంత ఇళ్లు, ఉచిత రేషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలన్నదే తన కోరిక అని అన్నారు. పేద ప్రజల కోసం పంపిన సొమ్ములను టీఎంసీ నేతలు లూటీ చేస్తున్నారన్నారు. 'టీఎంసీ ప్రభుత్వం నాకు, బెంగాల్ ప్రజలకు శత్రువుగా మారుతోంది' అని తీవ్రంగా ఆక్షేపించారు మోదీ.

బెంగాల్ విజన్‌తోనే 2047 నాటికి అభివృద్ధి భారత్ ‌విజన్‌‌ సాకారమవుతుందని ప్రధాని అన్నారు. ఒడిశా, త్రిపుర, అస్సాం, బిహార్‌లో బీజేపీ వరుస విజయాలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు బెంగాల్‌లో సుపరిపాలనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ ఇటీవల చారిత్రక విజయం సాధించిందని, ముఖ్యంగా ముంబై పురపోరు ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిందని గుర్తుచేశారు. 'ఈసారి బెంగాల్లో మార్పు అవసరముందని నేను చెబుతాను.. బీజేపీ సర్కార్ కావాలి' అని మీరు చెప్పండి.. అంటూ సభికులను మోదీ ఉత్సాహపరిచారు.


కేంద్ర పథకాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడంపై విమర్శలు గుప్పిస్తూ.. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అడ్డుకున్న ఏకైక రాష్ట్రం బెంగాల్ అని, పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అందనీయడం లేదని మోదీ చెప్పారు. ఇలాంటి క్రూర ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పే సమయం వచ్చిందన్నారు. మాల్దాలో ఫ్యాక్టరీలు లేకపోవడంతో మాల్దా, ముర్షీదాబాద్ ప్రజలు ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని, మామిడి రైతులు ప్రభుత్వ విధానాలు, వరదల సమయంలో చూపిస్తున్న నిర్లక్ష్యంతో ఎంతో నష్టపోతున్నారని అన్నారు. గంగా, ఫులాహార్ నదీ తీర కోత కారణంగా వేలాది మంది ఇళ్లు కోల్పోయారని, రక్షణ గోడ కోరుతూ ప్రజలు చేస్తున్న ఆర్తనాదాలను టీఎంసీ సర్కార్ ఖాతారు చేయడం లేదని విమర్శించారు. కేంద్రం పంపిన వరద సహాయక నిధులు లబ్ధిదారులకు చేరలేదని కాగ్ నివేదకలు కూడా చెబుతున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ అనుచిత విధానాలకు స్వస్తి చెప్పి, వరదల నివారణకు సమగ్ర పరిష్కారం కల్పిస్తామని, మామిడి సాగు చేసే మాల్దా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యం కల్పించి ఆర్థికంగా బలపడేలా చేస్తామని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

తొలి వందే భారత్ స్లీపర్ రైలుకు జెండా ఊపిన ప్రధాని మోదీ

నా బంగ్లా కూల్చిన వాళ్లను ప్రజలే సాగనంపారు.. ఠాక్రేలపై కంగన విసుర్లు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 17 , 2026 | 04:49 PM