దారుణం.. బంగారు గొలుసు కోసం స్నేహితుడి హత్య
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:15 PM
మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి, బైక్ కొనుగోలు చేసేందుకు ఇద్దరు మైనర్ బాలురు అత్యంత క్రూరంగా తమ ప్రాణ స్నేహితుడినే కడతేర్చారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని థానేలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి, బైక్ కొనుగోలు చేసేందుకు ఇద్దరు మైనర్ బాలురు అత్యంత క్రూరంగా తమ ప్రాణ స్నేహితుడినే కడతేర్చారు. బంగారు గొలుసు కోసం 17 ఏళ్ల యువకుడిని దారుణంగా హత్య చేసి.. ఆపై శవాన్ని దహనం చేశారు. ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
థానేలోని ఆజాద్ నగర్కు చెందిన ప్రజ్యోత్ కాంబ్లే అనే యువకుడు సెప్టెంబర్ 24న సాయంత్రంలో దృశ్యమయ్యాడు. మరుసటి రోజు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రజ్యోత్ స్నేహితుడిని విచారించగా.. అతను వేరే బైక్పై ఘోడ్బందర్ వైపు వెళ్లినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసులు సుమారు 80 నుంచి 90 సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా అతడి స్నేహితుడు చెప్పిన మాటలు అబద్ధమని తేలింది.
దీంతో సాంకేతిక ఆధారాల ద్వారా గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. ప్రజ్యోత్ ధరించిన బంగారు గొలుసును కాజేయాలని పథకం వేసిన నిందితుల్లో ఒకరు పుట్టినరోజు జరుపుకోవాలని, మరొకరు బైక్ కొనాలని భావించారు. సెప్టెంబర్ 24న సిగరెట్ తాగుదామంటూ ప్రజ్యోత్ను బ్రహ్మాండ్ ఫేజ్-2 ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో పొడిచి, బండరాయితో మోది హత్య చేశారు.
పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు 'దృశ్యం' సినిమాను తలపించేలా శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టడమే కాకుండా, బాధితుడి ఫోన్ను ఒక బస్సులో పడేశారు. కానీ, సీసీటీవీ పుటేజీలు, మొబైల్ లొకేషన్ ఆధారంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ వార్తలూ చదవండి
రాజస్థాన్లో ఘోర ప్రమాదం.. మినీ బస్సు ప్రమాదంలో 8 మంది మృతి..
ప్రపంచ ఆకలి సూచీలో భారత్కు 100వ స్థానం