మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
ABN , Publish Date - May 01 , 2026 | 05:13 PM
కోల్‌కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు మందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె కదలికలపై తాము నిఘా ఉంచినట్టు చెప్పారు.
కోల్‌కతా: కోల్‌కతాలోని ఒక ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ వద్ద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం రాత్రి నాలుగు గంటల సేపు ఉండటం, తెల్లవారుజామున 12.07 గంటలకు అక్కడి నుంచి వెళ్లిపోవడంపై బీజేపీ నేత సువేందు అధికారి (Sunvendu Adhikari) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలకు మందు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఆమె కదలికలపై తాము నిఘా ఉంచినట్టు చెప్పారు. అనుక్షణం ఆమె కదలికను తమ ఏజెంట్ గమినిస్తూ వచ్చినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించి భవానీపూర్ స్ట్రాంగ్ రూమ్‌లో మమతా బెనర్జీ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఆయన శుక్రవారంనాడు షేర్ చేశారు.
'ఔట్‌గోయింగ్ సీఎం ఎంత ప్రయత్నించినా నిబంధనలు ఉల్లంఘించకుండా మేము అడ్డుకున్నాం' అని సువేందు పేర్కొన్నారు. భవానీపూర్ నియోజక వర్గం నుంచి మమతాబెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ చేశారు.
సఖావత్ మెమోరియల్ స్కూలులో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ను మమతాబెనర్జీ గురువారం రాత్రి సందర్శించడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతున్నట్టు పలు ఫిర్యాదులు వచ్చినందునే తాను స్వయంగా వచ్చినట్టు మమత చెప్పారు. కేంద్ర బలగాలు తొలుత తనను రానీయలేదన్న ఆమె.. అక్కడే నాలుగు గంటల పాటు ఉన్నారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వస్తూ, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే ఎలాంటి చర్యలను సహించేది లేదని ఆమె హెచ్చరించారు. ఈవీఎంలు దొంగింలించేందుకు, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా జీవన్మరణ పోరాటం చేస్తామని అన్నారు. కాగా, ఉత్తర కోల్‌కతాలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను నేతాజీ ఇండోర్ స్టేడియంలో భద్రపరచగా, అక్కడ కూడా టీఎంసీ నేతలు ధర్నాకు దిగారు.
ఇవి కూడా చదవండి..
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ
పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు