పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు
ABN , Publish Date - May 01 , 2026 | 03:21 PM
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్‌పై వ్యాఖ్యల కేసులో పవన్ ఖేరాకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా (Pawan Khera)కు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఉపశమనం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రిణికి భూయాన్‌పై వ్యాఖ్యల కేసులో పవన్ ఖేరాకు అత్యున్నత న్యాయస్థానం శుక్రవారంనాడు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఏఎస్ చందూర్‌కర్‌తో కూడిన ధర్మాసనం పలు షరతులపై పవన్ ఖేరాకు ముందస్తు బెయిలు ఇచ్చింది. దీనిపై కోర్టు గురువారంనాడు తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు ప్రకటించింది.
ఈ కేసులో విచారణకు పవన్ ఖేరా సహకరించాలని, పిలిచినప్పుడు పోలీసుల ముందు హాజరు కావాలని, సాక్ష్యాలను తారుమారు చేసే చర్యలకు పాల్పడకూడదని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని సుప్రీం ధర్మాసనం షరతులు విధించింది. అదనపు షరతులు విధించే స్వేచ్ఛ విచారణ కోర్టుకు ఉంటుందని కూడా తెలిపింది.
రిణికి భూయాన్ శర్మ మూడు విదేశీ పాస్‌పోర్టులు, లెక్కల్లో చూపించని విదేశీ ఆస్తులు కలిగి ఉన్నట్టు పవన్ ఖేరా ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. రిణికి భూయాన్ ఫిర్యాదు చేయడంపై గువాహటిలో కేసు నమోదైంది. ఈ క్రమంలో పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ఏడు రోజుల ముందస్తు బెయిలు ఇచ్చింది. దీనిపై అస్సాం పోలీసులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తూ తాత్కాలిక ఆదేశాలిచ్చింది. గువాహటి హైకోర్టును ఆశ్రయించాలని ఖేరాకు సూచించింది. అనంతరం ఖేరాకు ముందస్తు బెయిలు ఇచ్చేందుకు గువాహటి హైకోర్టు నిరాకరించింది. దీనిని సుప్రీంకోర్టులో ఖేరా సవాలు చేశారు.
ఇవి కూడా చదవండి..
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ
అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు: అమిత్ షా