బోటు మునిగిన ఘటనలో ఒకరినొకరు హత్తుకుని ఉన్న తల్లీకొడుకుల మృతదేహాలు లభ్యం
ABN , Publish Date - May 01 , 2026 | 01:56 PM
నర్మదా నదిలో బోటు మునిగిపోతున్న సమయంలో ప్రాణభయంతో తల్లీకొడుకులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యల తర్వాత లభ్యమైన వారి మృతదేహాలు అదే స్థితిలో (ఒకరినొకరు హత్తుకుని) ఉండటం చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీరు పెట్టారు.
జబల్‌పూర్/న్యూఢిల్లీ, మే 1: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన బోటు ప్రమాదం అత్యంత విషాదాన్ని నింపింది. విహారయాత్రకు వెళ్లిన ఆయా కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని శోకాన్ని మిగిల్చింది. నదిలో బోటు మునిగిపోతున్న సమయంలో ప్రాణభయంతో తల్లీకొడుకులు ఒకరినొకరు గట్టిగా పట్టుకుని నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యల తర్వాత లభ్యమైన వారి మృతదేహాలు అదే స్థితిలో (ఒకరినొకరు హత్తుకుని) ఉండటం చూసి సహాయక సిబ్బంది కూడా కన్నీరు పెట్టారు.
బర్గీ డ్యామ్ సమీపాన నర్మదా నదిలో క్రూయిజ్ బోటు భేడాఘాట్ సమీపంలో అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బోటులో మిగతా పర్యాటలకులతో పాటు ఢిల్లీకి చెందిన ఒక ఫ్యామిలీ కూడా ఉంది. అయితే, బోటు ఒక్కసారిగా నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఢిల్లీకి చెందిన ఫ్యామిలీలో తండ్రి, కూతురు చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ, తల్లి, ఆమె కుమారుడు మాత్రం నది అలల ఉధృతికి నీటిలో మునిగిపోయారు.
కలచివేసిన దృశ్యం:
సహాయక బృందాలు గంటలపాటు గాలింపు చేపట్టిన అనంతరం ఇవాళ తల్లీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. ఆఖరి క్షణం వరకు వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక, ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఒకరినొకరు లైఫ్ జాకెట్‌లో కౌగిలించుకుని మరణించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విహారయాత్రకు వెళ్లి విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ప్రమాదం జరిగిందిలా..
కాగా, ఈ బోటు ప్రమాదం అత్యంత విషాదాన్ని మిగిల్చింది. వాతావరణం అకస్మాత్తుగా మారి, బలమైన గాలులు వీచడంతో బోటు నియంత్రణ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోటులోకి నీరు చేరడంతో హాహాకారాల మధ్య అంతా అస్తవ్యస్తంగా మారిందని చెబుతున్నారు. నిన్న (గురువారం) జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటివరకు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, గాలింపు చర్యల తర్వాత ఇవాళ ఒక తల్లి, ఆమె నాలుగేళ్ల కుమారుడి మృతదేహాలు వెలికితీశారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 24 మందిని రక్షించగా, అందులో 17 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదుగురు పిల్లలు సహా తొమ్మిది మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. లైఫ్ జాకెట్ ధరించిన క్రూయిజ్ కెప్టెన్ మహేష్ పటేల్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), స్థానిక పోలీసులు, జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News