Supreme Court: రాష్ట్రాలకు సుప్రీం సీరియస్ వార్నింగ్.. ఇకపై రాష్ట్రాలదే బాధ్యత!
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:52 PM
కుక్కల వల్ల ఎవరైనా గాయపడినా, చనిపోయినా.. దానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించే విధంగా ఆదేశిస్తామంటూ సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
ఢిల్లీ: భారతదేశంలో వీధి కుక్కల దాడుల(Stray Dog Attacks) విషయంపై సుప్రీంకోర్టు(Supreme Court) రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాలు.. వీధి కుక్కల నివారణకు సరైన చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కుక్కలు కరవడం వల్ల పిల్లలు, వృద్దులు ఎలాంటి ప్రమాదానికి గురైనా, దానికి సంబంధించిన నష్ట పరిహారం(Compensation) రాష్ట్రాలే చెల్లించేలా ఆదేశిస్తామని హెచ్చరించింది ధర్మాసనం. ఇటీవల వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ప్రజలు రేబిస్(Rabies)తో పాటు ఇతర ప్రమాదకర వ్యాధుల బారినపడుతున్నారు. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది.
స్కూల్స్, హాస్పిటల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్ పోర్ట్స్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు సంచరిస్తుంటారు. అలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా వీధి కుక్కలు దాడులు చేస్తున్నాయని, వాటికి ప్రత్యేకంగా షెల్టర్లు(Special shelters) ఏర్పాటుచేసి అక్కడికి తొలగించాలని ఆదేశించింది. కాగా.. దేశంలో వీధి కుక్కలకు సంబంధించిన కేసును న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ.అంజరియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘కుక్కల వల్ల ఎవరికి నష్టం జరిగినా రాష్ట్రాలే బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించేలా ఆదేశిస్తాం. కుక్కలకు ఆహారం పెట్టేవారు వారి ఇంట్లోనే పెంచుకుని అక్కడే వాటికి తిండిపెట్టాలి. జంతు ప్రేమికులం అని చెప్పుకు తిరిగేవారు.. ఇటీవల ఓ తొమ్మిదేళ్ల బాలుడిపై కుక్కలు అతి దారుణంగా దాడిచేసినపుడు ఎందుకు బాధ్యత తీసుకోలేదు' అని ప్రశ్నించారు. వీధుల్లోని అన్ని కుక్కలను తొలగించాలని తామెప్పుడూ ఆదేశించలేదు. యానిమల్ బర్త్ రూల్ ప్రకారం.. ట్రీట్‌మెంట్‌కాని శునకాలను షెల్టర్లకు తరలించాలని తెలిపినట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
భూతల దాడులకు కూడా సిద్ధం.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు... సీబీఐకి చెప్పిన విజయ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి