Supreme Court: వీధి కుక్కల వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jan 08 , 2026 | 04:13 PM
దేశంలో కొంత కాలంగా పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు సంఘటనలపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్టు పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్క (Stray dogs)ల దాడులు, కుక్క కాటు సంఘటనలపై దాఖలైన పిటిషన్ల(petitions)ను సుప్రీంకోర్టు (Supreme Court) ఈరోజు (గురువారం) మరోసారి విచారించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల బెడదపై చర్చ జరుగుతున్న సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ‘కుక్కలతో ఇన్ని బాధలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు పెంచుకుంటున్నారు?. వాటి బదులు పిల్లుల(Cats)ను పెంచుకోండి. కనీసం అవి ఎవరిపై దాడి చేయవు కదా’ అని చమత్కరించింది.
ఇంట్లో ఎలుకలను నియంత్రించడంలో పిల్లులు సహాయపడతాయని కోర్టు పేర్కొంది. వీధి కుక్కలకు ఆహారం పెట్టే వాళ్లు.. వాటి వల్ల ప్రమాదాలు ఎదుర్కొంటున్న సాధారణ ప్రజల మధ్య జరుగుతున్న వాదనలను వింటున్న సందర్భంలో ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కుక్కల మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అవి ఎప్పుడు దాడి చేస్తాయో ఎవరూ ఊహించలేరని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కుక్క కాటు బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రేబీస్ వల్ల ప్రాణాలకు ముప్పు ఉందని కోర్టు అభిప్రాయపడింది. వీధి కుక్కలపై ప్రేమ ఉండొచ్చు.. కానీ వాటి వల్ల మనుషులకు ప్రమాదం ఉండకూడదు స్పష్టం చేసింది.
కుక్కలు భయపడే మనిషి వాసనను పసిగట్టగలవు, ఆ విషయాన్ని గ్రహించినప్పుడు వాళ్లపై దాడి చేస్తుంది. ఇది వ్యక్తిగత అనుభవం నుంచి మాట్లాడుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీధి కుక్కల నుంచి ప్రజలకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు, ఆసుపత్రులకు వచ్చే రోగులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కోర్టు పేర్కొంది. పాఠశాలలు, కోర్టు ప్రాంగణాలు, హాస్పిటల్స్, ఎక్కువగా జనసంచారం ఉన్న ప్రదేశాలను కుక్కలు లేని ప్రాంతం (Dog Free)గా మార్చాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది.
ఇవీ చదవండి:
అయ్యో.. నా బిడ్డకు ఎంత కష్టం.. తండ్రి వేదన నెట్టింట వైరల్
గుడ్లురిమి చూస్తున్న మహిళ.. ఎక్కడ చూసినా ఈమె ఫొటోలే.. అసలు కథేంటంటే..