School Bag Weight Issue: అయ్యో.. నా బిడ్డకు ఎంత కష్టం.. తండ్రి వేదన నెట్టింట వైరల్
ABN , Publish Date - Jan 07 , 2026 | 10:40 PM
తన కొడుకు స్కూల్ బ్యాగ్ బరువు ఆందోళనకర స్థాయిలో ఉందంటూ ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఎవరు ఎంతగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా పరిస్థితుల్లో మార్పు రావట్లేదంటూ అనేక మంది ఈ పోస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో పుస్తకాలు, స్కూలు బ్యాగుల బరువు కింద బాల్యం నలిగిపోతోంది. ఈ విషయంలో తల్లిదండ్రుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతోంది. పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి మార్పూ రావడం లేదు. ఈ నేపథ్యంలో తన బిడ్డ పడుతున్న కష్టం చూసి తట్టుకోలేని ఓ తండ్రి నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. భారత్‌లో విద్యావ్యవస్థ ఇకనైనా మారాలని జనాలు ఎలుగెత్తేలా చేస్తోంది.
బాలూ గొరాడే అనే వ్యక్తి ఈ పోస్టును నెట్టింట పంచుకున్నారు. ఒకటవ తరగతి చదువుతున్న తన బిడ్డ స్కూలు బ్యాగు బరువు చూసి గుండె తరుక్కుపోయిన ఆయన తన ఆవేదనను నెట్టింట పంచుకున్నారు. తన బిడ్డ బరువు కేవలం 21 కేజీలేనని, కానీ వాడు మోసుకెళ్లే స్కూలు బ్యాగు బరువు (టిఫిన్ బాక్సు బరువు కూడా కలిపి..) మాత్రం 4.5 కేజీలని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం, స్కూలు బ్యాగు బరువు విద్యార్థుల బరువులో 10 శాతం వరకే ఉండాలని చెప్పారు. అంటే, బ్యాగు బరువు 2.1 కేజీలకు మించరాదు. కానీ ఇంతకు రెట్టింపు బరువును మోసుకుంటూ తన బిడ్డ రోజూ స్కూలుకు వెళ్లడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు స్కూల్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని అన్నారు. ‘మీరు మీ పిల్లల బ్యాగు బరువును చెక్ చేశారా?’ అని ప్రశ్నించారు.
ఈ పోస్టుపై తల్లిదండ్రులు, టీచర్లు, వైద్య నిపుణులు అనేక మంది స్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని అన్నారు. పుస్తకాలన్నీ స్కూల్లోనే వదిలి పిల్లలు ఇళ్లకు వెళ్లాలని, ఇంత బరువు మోయడం అనవసరమని అనేక మంది అభిప్రాయపడ్డారు.
వైద్యులు చెప్పేదాని ప్రకారం, అధిక బరువు వల్ల పిల్లల్లో వీపు నొప్పి వస్తుంది. కొందరిలో వెన్నెముకపై ఒత్తిడి పెరిగి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. చివరకు పిల్లలు నిలబడే తీరు, కూర్చునే తీరుల్లో మార్పులు వస్తాయి. కాబట్టి, ఈ విషయంలో పాఠశాలలు ఏ మాత్రం అలసత్వం వహించొద్దని నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:
బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ
కొత్త ఏడాదిలో కొత్త క్యాలెండర్ తెచ్చుకున్నారా? దీని వెనకున్న అసలు కథ ఏంటో తెలుసా?