Share News

వీధి కుక్కలు.. ప్రజల ప్రాణాల భద్రతా అంశంగా పరిగణించండి: సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 19 , 2026 | 11:40 AM

బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలంటూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో జారీ చేసిన ఆ ఉత్తర్వులను సవరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

వీధి కుక్కలు.. ప్రజల ప్రాణాల భద్రతా అంశంగా పరిగణించండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 19: బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించాలంటూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో జారీ చేసిన ఆ ఉత్తర్వులను సవరించాలని చేసిన విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్కూల్, కాలేజీ, రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర బహిరంగ ప్రదేశాల్లో కుక్కలను తొలగించాలంటూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా జంతు సంక్షేమ బోర్డు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా తన తీర్పులో.. పలు కీలక అంశాలను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వీధి కుక్కల సమస్యను జంతు సంక్షేమ అంశంగా కాకుండా ప్రజల ప్రాణాల భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) రూపొందించిన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయడం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక పూర్తి స్థాయి యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. జనాభాను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే జిల్లాలో ఈ కేంద్రాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు‌ ఆదేశించింది.


ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని స్కూళ్లు, కాలేజీలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతోపాటు ఇతర ప్రదేశాల్లో కూడా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా యాంటీ రేబిస్ మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. రహదారులపై సంచరించే పశువుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


జాతీయ రహదారులపై తిరిగే జంతువుల సమస్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ (NHAI)ను కోరింది. రేబిస్ బారిన పడిన లేదా మానవుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదకర కుక్కల విషయంలో చట్టబద్ధంగా అనుమతించిన చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల అమలు కోసం విధులు నిర్వహించే ఉద్యోగులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు సూచించింది. విధులు నిర్వర్తించే క్రమంలో వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సాకులతో కోతలు.. వ్యవసాయ విద్యుత్‌ ఉంటే ఒట్టు

నకిలీ మద్యం కేసులో తుది ఛార్జిషీట్ దాఖలు చేసిన అధికారులు

For More National News And Telugu News

Updated Date - May 19 , 2026 | 12:51 PM